వైసీపీలో ముంద‌స్తు గానం.. వ్యూహం ఏంటి..?

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముంద‌స్తు కోయిల కూస్తోంది. వ‌చ్చే ఏడాదిలోనే సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసుకుని ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే వాద‌న‌ను వైసీపీ నేత‌లు బ‌హిరంగంగానే చేస్తున్నారు. అయితే.. దీని వెనుక వ్యూహం ఏదైనా ఉందా ? లేక నిజంగానే జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అనుకుంటున్నారా ? అనేది సందేహం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు (జ‌గ‌న్ మిన‌హా). అయితే.. వీరిలో స‌గానికి స‌గం మంది.. సొంత కార్య‌క్ర‌మాలు, వ్యాపారాలు అజెండాలు అమ‌లు చేసుకుంటున్నారు త‌ప్ప‌.. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో నిమ‌గ్నమ‌వుతున్న వారు చాలా త‌క్కువగా ఉన్నారు.

వీరిని క‌ట్ట‌డి చేసేందుకు, లైన్‌లో పెట్టేందుకు.. ఇప్ప‌టికే చాలా సార్లు.. సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నించారు. అయితే.. ఎక్క‌డా క‌ఠినంగా మాట్లాడ‌లేదు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేయ‌డం.. ల‌బ్ధిదారుల‌కు న్యాయం చేయండి.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉండండి అని మాత్ర‌మే ఆయ‌న చెబుతున్నారు. అయితే.. ఇవి విన్న‌వారు వింటున్నారు. లేనివారు లేదు. సో.. ఈ క్ర‌మంలో ఇలాంటి వారిని లైన్‌లో పెట్టాలంటే.. ఖ‌చ్చితంగా.. ఏదో ఒక వ్యూహంతోనే ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ క్ర‌మంలోనే ‘ముంద‌స్తు’ అనే ప్ర‌చారం తీసుకువ‌చ్చారా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

పోనీ.. ఈ విష‌యాన్ని ప‌క్క‌న పెట్టినా.. ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారుపై పెల్లుబుకుతున్న వ్య‌తిరేక‌త‌ను క‌ట్ట‌డి చేయ‌డంలో భాగంగా.. ముంద‌స్తును చ‌ర్చ‌నీయాంశంగా మార్చారా? అనే అనుమానం కూడా వ్య‌క్త‌మ‌వుతోం ది. ప్ర‌స్తుతం రాష్ట్రం ఆర్థిక క‌ష్టాల్లో ఉంద‌ని.. రాష్ట్రంలో ఆర్థిక ఎమ‌ర్జెన్సీ విధించే అవ‌కాశం లేక‌పోలేద‌ని.. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌రాజు వ్యాఖ్యానించారు. టీడీపీ నేత‌లు కూడా ఇదే త‌ర‌హాలో వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ‘ఆర్థిక అరాచ‌కాలు’ అనే టైటిల్‌తో ఇటీవ‌ల కాలంలో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీటి నుంచి త‌ప్పించుకునేందుకు ముంద‌స్తును తెచ్చి.. చ‌ర్చ‌ను అటువైపు మ‌ళ్లించారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి.

పోనీ.. ముంద‌స్తు నిజ‌మే అనుకున్నా.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. ఇంకా రెండున్న‌రేళ్లు కూడా పూర్తికాలేదు. పోనీ.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెల్లుబుకుతోందా? అంటే.. అది కూడా లేదు. సాధార‌ణంగా ఏ ప్ర‌భుత్వంపైనైనా.. ప్ర‌తిప‌క్షాలు చేసే విమ‌ర్శ‌లే ఇక్క‌డ కూడా క‌నిపిస్తున్నాయి.. త‌ప్ప‌.. ప్ర‌త్యేకంగా ఏమీ లేదు. నిజానికి ఇప్ప‌టికే చాలా రరాష్ట్రాలు.. అప్పుల్లో ఉన్నాయి. ఇటీవ‌ల‌.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా ఈ జాబితాలో పంజాబ్‌.. త‌దిత‌ర రాష్ట్రాలు ముందున్నాయ‌ని చెప్పింది. ఇక‌, తెలంగాణ కూడా ఈ వ‌రుస‌లోనే ఉంది. మ‌రి.. ఇలాంటివి కామ‌నే అయిన‌ప్పుడు.. ముంద‌స్తుకు అవ‌కాశం లేదు. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ నేత‌లు ఓ వ‌ర్గం మీడియాకు క్లూలిస్తూ.. ముంద‌స్తుపై తీవ్ర ప్ర‌చారం చేస్తున్నారు. సో.. దీనిని బ‌ట్టి అనుమానాలు వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.