విజయనగరం జిల్లాపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టిందా ? ఇక్కడ టీడీపీ హవాను తగ్గించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకుందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ముఖ్యంగా టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును డైల్యూట్ చేయడం ద్వారా.. జిల్లాలో టీడీపీకి కేరాఫ్ లేకుండా చేయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అశోక్ చైర్మన్‌గా ఉన్న మాన్సాస్ ట్రస్టు.. సింహాచలం బోర్డు.. వంటి వాటిని రద్దు చేసి, ఆయన ను తొలిగించింది. ఆ తర్వాత.. ఈ పీఠాలను.. సంచయితకు అప్పగించింది. అయితే.. న్యాయపోరాటం చేసిన అశోక్.. తిరిగి వాటిని దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పుడు మళ్లీ వైసీపీ వ్యూహాత్మకంగా ప్లాన్ మార్చింది. అశోక్‌కు రాజకీయంగా చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మ రం చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గజపతి రాజులు వర్సెస్ బొబ్బిలి రాజులకు మధ్య విభేదాలను తనకు అనుకూలంగా మార్చుకుని.. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చి.. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి.. తర్వాత.. టీడీపీలోకి జంప్ చేసిన బొబ్బిలి రాజకుటుంబం సుజయ్ కృష్ణరంగారావును తిరిగి.. పార్టీలోకి ఆహ్వానించేందుకు వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
అశోక్ గజపతి రాజు టీడీపీలో ఉండగా..తమకు ప్రాధాన్యత దక్కదని .. గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు సైతం అమలు కాకపోవటంతో.. వైసీపీలోకి రావటమే మంచిదనే భావనలో సుజయ్ సోదరులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని బట్టి అటు వైసీపీ, ఇటు సుజయ్ లు కూడా మళ్లీ చేతులు కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర వ్యవహారాలు చూస్తున్న వైసీపీ ముఖ్య నేత ద్వారా ఇందు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్ నుంచి 2009 లో బొబ్బిలి ఎమ్మెల్యేగా గెలిచిన సుజయ కృష్ణ రంగారావు జగన్ కు మద్దతుగా వ్యవహరించటంతో కాంగ్రెస్ ఆయనను దూరం పెట్టింది.
దీంతో ఆయన వెంటనే వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై విజయం దక్కించుకున్నారు. అయితే.. మంత్రిపదవిపై ఆశతో.. తరువాత టీడీపీలో చేరారు. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో ఉండేకన్నా.. వైసీపీ అయితే.. బెటర్ అని సుజయ్ భావిస్తున్నట్టు కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ప్రభుత్వం కూడా.. బొబ్బలి రాజులకు అటు పూసలపాటి వారితో చారిత్రక వైరం కూడా తమకు కలిసి వస్తుందని వైసీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో అటు సుజయ్ వచ్చేందుకు రెడీగా ఉండగా.. పార్టీ కూడా ఆయనను చేర్చుకునేందుకు సిద్ధమైంది. ఇక అక్కడ వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడుకు వయస్సు పైబడడంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే అవకాశాలు లేవు. దీంతో వైసీపీ బొబ్బిలి రాజులను పార్టీలో చేర్చుకునేందుకు మరింత ఉత్సాహం చూపుతోంది. అయితే.. ఈ విషయంలో సీఎం నిర్ణయం తీసుకుంటే సరిపోతుందని తెలుస్తోంది.