హుజూరాబాద్‌లో వెయ్యిమందితో నామినేష‌న్‌.. ష‌ర్మిల వ్యూహం ఇదే!

తెలంగాణలో రాజ‌కీయాల‌న్నీ ఇప్పుడు హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతున్నాయ‌న‌డంలో సందేహం లేదు. అక్క‌డ ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. వ్యూహాల‌ను ప‌దును పెడుతోంది. మ‌రోవైపు టీఆర్ఎస్‌ను ఎదురించి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌పున హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బ‌రిలో దిగ‌నున్న ఈట‌ల రాజేంద‌ర్ కూడా విజ‌యం కోసం ప్రాణం పెట్టి ప‌నిచేస్తున్నారు. ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌ను ఈ ఎన్నిక‌లే నిర్ణ‌యించే అవ‌కాశం ఉండ‌డ‌మే అందుకు కార‌ణం. మ‌రోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థిని నిల‌బెట్ట‌నుంది. ఇక ఈ ఎన్నిక‌ల నుంచి దూరంగా ఉండ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఇప్పుడు కేసీఆర్‌కు షాకిచ్చే దిశ‌గా సాగుతోంద‌ని తెలుస్తోంది.

తెలంగాణ‌లో రాజ‌కీయ శ‌క్తిగా మారాల‌ని భావిస్తున్న ష‌ర్మిల రాష్ట్రంలో నిరుద్యోగుల స‌మ‌స్య‌ను భుజాల‌కెత్తుకున్న సంగ‌తి తెలిసిందే. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు సంబంధించిన ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని ష‌ర్మిల‌ కొంత‌కాలంగా దీక్ష‌లు, నిర‌స‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే హుజూరాబాద్ పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆమె.. అక్క‌డ నిరుద్యోగులు పోటీచేస్తే మాత్రం మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ఇప్ప‌టికే పేర్కొన్నారు. ఇప్పుడు ఈ అంశాన్ని ఆమె సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో కేసీఆర్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య వైఖ‌రికి వ్య‌తిరేకంగా ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆమె.. ఆ దిశ‌గా ఈ ఉప ఎన్నిక‌ను ఉప‌యోగించుకోవాల‌ని చూస్తోంద‌నే అభిప్రాయాలు విన‌పడుతున్నాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో వెయ్యి మందికి పైగా నిరుద్యోగుల‌తో నామినేష‌న్లు వేయించేలా ఇప్పుడు ఆమె పార్టీ నిర్ణ‌యించిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ద‌గ్గరుండి మ‌రీ ఆ నిరుద్యోగుల‌తో హుజూరాబాద్‌లో నామినేష‌న్లు వేయించాల‌ని వైఎస్ఆర్టీపీ ప్ర‌ణాళిక సిద్ధం చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అంద‌రి దృష్టిని త‌మ వైపున‌కు తిప్పుకునే అవ‌కాశం ఆ పార్టీకి ద‌క్కుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీపై కేవ‌లం విమ‌ర్శ‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైతే స‌రిపోద‌ని ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంద‌ని ష‌ర్మిల భావిస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వెయ్యిమంది నిరుద్యోగుల‌తో హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు వేయిస్తే ప్ర‌భుత్వంపై ఒత్తిడి పెంచిన‌ట్లు అవుతోంది. ఒక‌వేళ ప్రభుత్వం స్పందించి త్వ‌ర‌గా ఉద్యోగాల భ‌ర్తీ విష‌యంలో ఓ నిర్ణ‌యం తీసుకుంటే అది వైఎస్సార్‌టీపీ ఖాతాలోనే చేరే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇప్పుడు హుజూరాబాద్‌లో నిరుద్యోగుల‌తో నామినేష‌న్లు వేయించ‌డం ద్వారా ఇటు ప్ర‌జ‌ల్లో అటు నిరుద్యోగుల్లోనూ పార్టీ ప‌ట్ల సానుకూలత వ్య‌క్త‌మ‌వుతుంద‌ని ష‌ర్మిల అనుకుంటున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ‌రోవైపు ఈ చ‌ర్య‌ల‌ను కూడా ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుప‌ట్టే ప‌రిస్థితి లేదు. ఇలా ఈ నిర్ణ‌యంతో ఆ పార్టీకి అన్ని ర‌కాలుగా మేలు జ‌రిగే అవ‌కాశ‌ముంద‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్‌లో పోటీ చేయ‌న‌ప్ప‌టికీ.. నిరుద్యోగుల‌తో నామినేష‌న్లు వేయించ‌డం ద్వారా ష‌ర్మిల అనుకున్న లాభాన్ని పొందే వీలుంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.