కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలోపేతం దిశగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జనఆశీర్వాద్ యాత్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా గురువారం ఏపీలోని తిరుపతి, విజయవాడల్లో ప్రసంగించారు. ఆ సందర్భంగా ఏపీలోని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వం అసమర్థత కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని విమర్శించారు. ఆ రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇలా బయట ప్రసంగాల్లో అధికార ప్రభుత్వాన్ని తిట్టిపోసిన కిషన్ రెడ్డి.. ఆ తర్వాత అనూహ్యంగా సీఏం జగన్‌తో భేటీ కావడంతో అందరూ విస్తుపోయారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కిషన్ రెడ్డి నేరుగా జగన్ ఇంటికి వెళ్లారు. ఆయనతో జగన్‌తో సమావేశమవుతారనే విషయం ఏపీ బీజేపీ నేతలకే తెలీదని సమాచారం. అప్పటి వరకూ ఆయనతో ఉన్న బీజేపీ సీనియర్ నేతలను ఈ భేటీకి రానీవకుండా పక్కన పెట్టారు. మరి ఇలా రహస్యంగా జగన్ ఇంటికి వెళ్లాల్సిన అవసరం కిషన్ రెడ్డికి ఏముందనే చర్చ ఇప్పుడు జోరందకుంది. ఎందుకంటే కేంద్రమంత్రి అయిన ఆయన అధికారిక పర్యటన కోసం రాష్ట్రానికి రాలేదు. జన ఆశీర్వాద్ పేరుతో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి పార్టీ కార్యక్రమం కోసం వచ్చిన ఆయన సీఎం జగన్‌తో మర్యాదపూర్వకంగా ఎందుకు భేటీ అయ్యారు? ఆ అవసరం ఎందుక వచ్చిందనేది రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది.
ఓ వైపు కేంద్రంలోని అధికార బీజేపీని వైసీపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారిందని తమ ప్రభుత్వాన్ని కూలదోల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అసలు రాష్ట్రంలో పెద్దగా బలం లేని బీజేపీకి వైసీపీ అనవసరంగా మార్కెట్ కల్పిస్తుందని ఇప్పటికే అభిప్రాయాలున్నాయి.
ఇక ఇప్పుడు జగన్‌ను కిషన్ రెడ్డి కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ బీజేపీ నేతలను మరింత గందరగోళంలోకి నెట్టేసింది. ఇలా రాష్ట్రంలోని ఆ పార్టీ శ్రేణులను అయోమయంలోకి నెట్టేయడం కోసం కిషన్ రెడ్డిని జగన్ విందుకు ఆహ్వానించారని అంటున్నారు. అయితే ఏదేమైనా ఎలాంటి ప్రయోజనాలు లేకుండా ప్రస్తుత రాజకీయాల్లో ఏమీ జరగదనేది బహిరంగ రహస్యమే. అలాంటిది ఇప్పుడీ ఇద్దరి భేటీ వెనక కూడా ఏదో ఓ కారణం ఉండే ఉంటుంది. ఎప్పుడోసారి అది బయటపడుతుందని ప్రజలు అనుకుంటున్నారు.