తెలుగుదేశం పార్టీకి బాగా సన్నిహితంగా ఉండే వర్గాల సమాచారం ప్రకారం రాబోయే కాలంలో మళ్ళీ టీడీపీ, జనసేన ఒకటవబోతున్నాయట. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ కుదేలైపోయాయి. తెలుగుదేశం పార్టీకన్నా 23 ఎంఎల్ఏ, 3 ఎంపీ సీట్లు దక్కాయి. మిగిలిన కాంగ్రెస్, బీజేపీ, జనసేనకు ఏమీ దక్కలేదు. జనసేన తరపున రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ గెలిచారు కానీ ఆయన కూడా వైసీపీ నేతే.
రాజోలు నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేయటానికి టికెట్ దక్కకపోతే చివరి నిముషంలో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకున్నారు. కాబట్టి జనాలు ఆయన వైసీపీ నేతగానే చూసి ఓట్లేసి గెలిపించుకున్నారు. అంతేకానీ జనసేన నేతగా చూడలేదన్నది వాస్తవం. అందుకనే రాపాక సాంకేతికంగా తాను జనసేన ఎంఎల్ఏనే అయినా వైసీపీ ఎంఎల్ఏగా ఐడెంటిఫై అవ్వటానికే ఇష్టపడుతున్నట్లు చెప్పారు.
సరే ప్రస్తుత విషయానికి వస్తే బీజేపీ+జనసేన మిత్రపక్షాలే అయినప్పటికీ ఎప్పుడూ కలిసి పనిచేసిందేమీలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన నిరసన కార్యక్రమాల్లో కూడా జనసేన నేతలను కలుపుకున్నదిలేదు. చివరకు బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మీడియా సమావేశాల్లో కూడా జనసేన నేతలు ఎక్కడా కనబడరు. నిజానికి జనసేన వల్ల బీజేపీకి ఏమన్నా లాభం ఉంటుందేమో కానీ బీజేపీ వల్ల జనసేనకు వచ్చే లాభం ఏమీ లేదు.
పైగా కేంద్రంలో నరేంద్ర మోడీ పై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసేది అనుమానంగా మారింది. మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు దేనికదే పోటీ చేసింది. కొన్నిచోట్ల జనసేన+టీడీపీ కలిసి పోటీ చేశాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండుపార్టీలు కలిసి పోటీచేయబోతున్నట్లు సమాచారం. బీజేపీతో కలిసి పోటీ చేయడం కన్నా టీడీపీతో చేతులు కలపటం వల్లే ఉపయోగం ఉంటుందని జనసేన ముఖ్యనేతలు పవన్ కు చెప్పారట.
పార్టీలోని సన్నిహితులు కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే పవన్ తో గట్టిగా చెప్పారట. పవన్ తో కలిసి పనిచేయటానికి చంద్రబాబునాయుడుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. కాబట్టి రెండుపార్టీలు మళ్ళీ కలవటంలో టీడీపీ నుండి ఎలాంటి సమస్యలు ఉండవు. కాబట్టే పొత్తుల విషయాన్ని రెండుపార్టీల నేతలు సమయం వచ్చినపుడు బహిరంగపరచాలని అనుకున్నట్లు టీడీపీ సన్నిహితవర్గాలు చెప్పాయి. క్షేత్ర స్ధాయిలో రెండు పార్టీల్లోని గ్రౌండ్ రియాలిటీ చూసిన తర్వాత తొందరలోనే ప్రకటన ఉంటుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates