త్వరలోనే జరగనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం.. సీఎం కేసీఆర్.. కొన్నాళ్లుగా దళిత జపం చేస్తున్న విషయం తెలిసిందే. నియోజకవర్గంలోని దళితులను తన పక్షానికి తిప్పుకోవడం.. తను దూరం చేసిన ఈటల రాజేందర్ ను ఘోరంగా ఓడించడమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన దళిత బంధు.. పథకాన్ని ప్రవేశ పెట్టారు. హుజూరాబాద్‌కు ఏకంగా 2000 కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం కేటాయించారు. దళిత వాడలకు వెళ్లి(వాసాలమర్రి) భోజనాలు చేస్తున్నారు. దళితుల కోసం ఎంతో చేస్తున్నానని చెబుతున్నారు. ఇలా.. అనేక రూపాల్లో దళితులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్.. అదే క్రమంలో మరో సంచలన చర్య చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో మొదటిసారిగా ఓ దళిత అధికారి నియమితులు కానున్నారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘దళిత బంధు’ పథకం పర్యవేక్షణ బాధ్యతలను రాహుల్ బొజ్జాకు అప్పగించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ సభలో ప్రకటించారు. ఆయనను సీఎంఓ కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత ఓ దళిత అధికారికి ముఖ్యమంత్రి కార్యాలయంలో కొలువు దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాహుల్ ప్రస్తుతం షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
ప్రముఖ న్యాయవాది, హక్కుల నేత దివంగత బొజ్జా తారకం తనయుడే రాహుల్. 2000 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రాహుల్, గతంలో వ్యవసాయ శాఖ కార్యదర్శిగా, కమిషనర్‌గా పని చేశారు. ప్రస్తుతం సీఎంఓలో అధికారులను చూస్తే.. ముఖ్యకార్యదర్శిగా నర్సింగ్‌రావు, కార్యదర్శిగా స్మిత సబర్వాల్(మిషన్ భగీరథ), మరో కార్యదర్శిగా వి.శేషాద్రి(రెవెన్యూ), ప్రత్యేక కార్యదర్శిగా రాజశేఖర రెడ్డి(ఎడ్యుకేషన్), మరో ప్రత్యేక కార్యదర్శిగా భూపాల్ రెడ్డి(సంక్షేమం) పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎంఓలో ఒక్క దళిత అధికారిని నియమించలేదంటూ విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో విపక్షాలు, దళిత సంఘాలు, బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సీఎం కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దళిత సామాజిక వర్గానికి చెందిన రాహుల్ బొజ్జాను సీఎంఓలో నియమించడం ద్వారా విమర్శలకు చెక్ పెట్టడంతోపాటు.. హుజూరాబాద్‌లో విజయం దిశగా దూసుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates