హైటెక్ బాబు: 14 వేల మందితో ఆన్‌లైన్ మహానాడు

చంద్రబాబు అంటే టెక్నాలజీ గుర్తుకు వస్తుంది. టెక్నాలజీని అందుకోవడంలో టీడీపీ అధినేత ముందుంటారు. తెలుగుదేశం పార్టీకి మహానాడు ఈ పార్టీకి పెద్ద పండుగ. ఎన్టీఆర్ జయంతి మే 28 కలిసి వచ్చేలా ప్రతి ఏడాది మూడు రోజులు అట్టహాసంగా నిర్వహిస్తారు.

ఈసారి బుధ, గురువారం నిర్వహిస్తున్నారు. అయితే కరోనా కారణంగా గతంలో వలే భారీ సభలు ఏర్పాటు చేసుకోవడానికి వీల్లేదు. దీంతో పార్టీ చరిత్రలో తొలిసారి వర్చువల్ మహానాడు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు, విదేశాల్లోని పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన నాయకులు, కార్యకర్తలు దాదాపు పద్నాలుగువేల మంది జూమ్ యాప్ ద్వారా భాగస్వామ్యం అవుతున్నారు.

యూట్యూబ్, ఫేస్‌బుక్ లైవ్ ద్వారా 10వేలమందికి పైగా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఓ పార్టీ వేలమంది నాయకులు, కార్యకర్తలను భాగస్వామ్యం చేస్తూ వర్చువల్ ప్రోగ్రాం నిర్వహించడం ఇండియాలో ఇదే మొదటిసారి. వీరంతా తమ తమ ఇళ్ల నుండే మహానాడులో పాల్గొంటారు. కొంతమంది కీలక నేతలు పార్టీ కార్యాలయం నుండి పాల్గొంటారు.
అందరూ జూమ్ యాప్ ద్వారా భాగస్వామ్యం అవుతారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఎల్జీ పాలిమర్స్ ఘటన, కరోనా వల్ల కార్మికుల కష్టాలు, టీటీడీ ఆస్తుల అమ్మకం, వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యంతదితర అంశాలపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు.

కరోనా దెబ్బతో..

కరోనా మహమ్మారి కారణంగా మహానాడును ఈసారి రెండు రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, ఇతర నేతలు భౌతిక దూరం పాటిస్తూ కూర్చుంటారు. ప్రత్యేక వేదిక ఉండదు. ఈ రోజు (మే 27) ఉదయం 11 గంటలకు మహానాడు ప్రారంభమవుతుంది. సాధారణంగా రెండేళ్లకు ఓసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కరోనా వల్ల ఈసారి కాస్త ఆలస్యం కానుంది.