‘యే..దోస్తీ’…ఆ సీఎం పాడిన పాట వైరల్

దేశంలోని బీజేపీ కీలక నేతల్లో ఒకరిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు పేరున్న సంగతి తెలిసిందే. గత పదేళ్లుగా మధ్యప్రదేశ్ లో బీజేపీకి పట్టుపెరగడానికి శివరాజ్ శింగ్ కారణంటే అతిశయోక్తి కాదు. ఇక, పార్టీతో పాటు మధ్యప్రదేశ్ ప్రజలు కూడా శివరాజ్ సింగ్ ను మామా అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. రాజకీయాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనే మామ….ముగ్గురు అమ్మాయిలన దత్తత తీసుకొని వారికి పెళ్లిళ్లు కూడా జరిపించి అందరి మన్ననలు పొందారు.

ఇక, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌ వర్గీయ, శివరాజ్ సింగ్ చౌహాన్ ల మధ్య చాలా ఏళ్లుగా విడదీయరాని స్నేహబంధం ఉంది. చాలామంది బీజేపీ కార్యకర్తలు వీరిద్దరినీ షోలేలో అమితాబ్, ధర్మేంద్రలతో పోలుస్తుంటారు. ఆ పిలుపునకు తగ్గట్లుగానే తాజాగా ఈ ఇద్దరు మిత్రులు కలిసి షోలేలో పాట పాడి అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ‘యే దోస్తీ హమ్ నహీ చోడ్‌దేంగే’ అంటూ ఈ ఇద్దరు కీలక నేతలు చేతులు పట్టుకొని పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ ఓ కార్యక్రమంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాస్‌ వర్గీయలతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరిద్దరు తమ స్నేహబంధానికి గుర్తుగా షోలేలోని ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్ పాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. స్నేహం గొప్పదనాన్ని చాటిచెప్పే ‘యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే’ పాటను ఈ ఇద్దరు అలవోకగా పాడి అబ్బురపరిచారు. తాను సీఎంననే విషయం పక్కకు పెట్టి ప్రొఫెషనల్ సింగర్ లాగా మైక్ పట్టుకొని శివరాజ్ పాటపాడడంతో ఆయన అభిమానులు ఆకాశంలో తేలుతున్నారు.

ఇక, ఈ పాటను శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. అంతేకాదు, షోలే సినిమాలో నటించిన నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలను మామా ట్యాగ్ చేయడం విశేషం. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి శివరాజ్ సింగ్ చౌహన్, కైలాష్ విజయ వర్గీయ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. గతంలోనూ ఈ మిత్రులిద్దరూ దోస్త్ మేరా దోస్త్ …అంటూ చాలాసార్లు పాటలు పాడారు. అయితే, అసెంబ్లీ ముందు ఈ సారి పాడడం విశేషం.