సుప్రీం కోర్టులో ఎల్జీ పాలిమ‌ర్స్‌కు షాక్‌

త‌మ సంస్థ‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు, నేష‌న‌ల్ గ్రీన్ ట్రిబ్యున‌ల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లిన ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థకు చుక్కెదురైంది. ఈ కేసులో తాము జోక్యం చేసుకోబోమ‌ని.. విచార‌ణ హైకోర్టు, ఎన్జీటీలే చూసుకుంటాయ‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

విశాఖ‌ప‌ట్నంలోని గోపాల ప‌ట్నంలో ఎల్జీ పాలిమ‌ర్స్ సంస్థ నుంచి స్టెరీన్ గ్యాస్ లీక్ కార‌ణంగా ఇద్ద‌రు పిల్ల‌లు స‌హా 12 మంది ప్రాణాలు కోల్పోవ‌డం, వంద‌ల మంది అస్వ‌స్థ‌త‌కు గురి కావ‌డంతో ఆ ప్లాంటును మూసి వేయాల‌ని ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే సంస్థ ప్ర‌తినిధులు ఎవ్వ‌రూ విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌ని, వారి పాస్ పోర్టుల‌ను సీజ్ చేయాల‌ని కూడా హైకోర్టు ఆదేశించింది. మ‌రోవైపు ఈ విషాదంపై విచార‌ణ‌కు ఎన్జీటీ ఏడు క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది.

ఐతే హైకోర్టు, ఎన్జీటీ ఆదేశాల‌పై స్టే ఇవ్వాల‌ని ఎల్జీ పాలిమర్స్ సంస్థ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. ప్లాంట్‌లో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల దృష్ట్యా లోనికి వెళ్లేందుకు త‌మ సిబ్బందికి అనుమతి ఇవ్వాల‌ని కోరింది. అలాగే ఎన్జీటీ ఏర్పాటు చేసిన ఏడు క‌మిటీల్లో విచార‌ణ కోసం దేని ముందు హాజరుకావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొంది.

ఐతే ఈ కేసులో జోక్యం చేసుకోవ‌డానికి సుప్రీం కోర్టు నిరాక‌రించింది. వీటిపై ఎన్జీటీ లేదా హైకోర్టు మాత్ర‌మే పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు నిరాకరించింది. దీంతో ఎల్జీ సంస్థకు మ‌రో ఆప్ష‌న్ లేక‌పోయింది.

పెద్ద విషాదానికి కార‌ణ‌మైన ఎల్జీ సంస్థ ప‌ట్ల ఏపీ స‌ర్కారు అంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌ట్లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న స‌మ‌యంలో హైకోర్టు, ఎన్జీటీ జోక్యం చేసుకుని క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. సుప్రీం కోర్టులో ఆ సంస్థ‌కు చుక్కెదురైన నేప‌థ్మంలో హైకోర్టు, ఎన్జీటీ త‌దుప‌రి ఎలాంటి చ‌ర్య‌లు చేప‌డ‌తాయో చూడాలి.