మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రు? జాతీయ స్థాయిలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రు? ఎవ‌రు ఆయ‌నకు దీటైన పోటీ ఇవ్వ‌గ‌ల‌రు? కేంద్రంపై ఎవ‌రు త‌మ‌దైన ముద్ర‌ను వేయ‌గ‌ల‌రు? ఇవీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆస‌క్తి రేపుతున్న అంశాలు. సంప్ర‌దాయ కాంగ్రెస్ నేత‌ల‌కు భిన్నంగా.. వ్య‌వ‌హ‌రించ‌గ‌లిగే నాయ‌కుడు/నాయ‌కురాలు అయితేనే.. కేంద్రంలో మోడీకి ప్ర‌త్యామ్నాయం కాగ‌ల‌ర‌నే వాద‌న కొన్నేళ్లుగా వినిపిస్తున్నా.. అంతులేని అధికార పిపాస‌తో ర‌గిలిన నేత‌లు.. ఏర్ప‌రుచుకున్న కూట‌ములు.. కొద్దిరోజుల్లోనే కుప్ప‌కూలిన ప‌రిస్థితి అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే న‌రేంద్ర మోడీ వంటివారు.. త‌మ‌కు ప్ర‌త్యామ్నాయం లేద‌నే వాద‌న‌ను ప‌రోక్షంగా తీసుకువ‌స్తున్నారు.

“ఈ దేశానికి ఏదైనా చేయాలంటే. మేమే..! మాతోనే ఈ దేశానికి మంచి జ‌రుగుతుంది!” అంటూ.. ఇటీవ‌ల కాలంలో ప‌దేప‌దే చెబుతున్న మోడీ ధైర్యం.. వెనుక అక్ష‌రాల ఉన్న‌ది.. ప్ర‌త్యాయ శ‌క్తులు ఏర్ప‌డ‌లేవ‌నే విశ్వాస‌మే! పైగా కాంగ్రెస్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఏటికీదుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక పోవ‌డం.. అధిష్టానం స‌త్తువ నానాటికీ త‌గ్గుముఖం ప‌డుతుండ‌డం వంటి కార‌ణాలు.. సుదీర్ఘ చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న కాంగ్రెస్‌కు పెను శాపాలుగా ప‌రిణ‌మించాయి. యువ నాయ‌కుడు, గాంధీల వార‌సుడుగా పేరున్న రాహుల్ రాజ‌కీయం.. పేరు గొప్ప ఊరు దిబ్బ‌.. అన్న‌చందంగా మార‌డం.. మోడీ వంటి నేత‌ను బ‌లోపేతం చేసింద‌న‌డంలో సందేహం లేదు.

“ఒక గొప్ప మార్పున‌కు నాంది ఇక్క‌డ నుంచే మొద‌ల‌వ్వాలి. మ‌న‌లో ఎవ‌రు ప్ర‌ధాని అవుతార‌నే విష‌యాన్ని త‌ర్వాత చ‌ర్చిద్దాం. ముందు.. కేంద్రంలో పాగా వేసేందుకు వ్యూహాత్మ‌కంగా క‌ద‌లాలి!” అని దాదాపు ద‌శాబ్దం కింద‌ట‌.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి హోదాలో జ‌య‌ల‌లిత ఇచ్చిన పిలుపు.. దేశ‌రాజ‌కీయాన్ని ప్ర‌త్యామ్నాయ పాలిక వైపు న‌డిపిస్తుంద‌నే ఆశ‌లు చిగురించేలా చేసింది. అయితే.. అస‌లు కిటుకు, అధికార వ్యూహం జ‌య‌ ద‌గ్గ‌రే ఉన్నాయంటూ.. ఆదిలోనే కూటమిలో ముస‌లం పుట్టి.. అంతిమంగా ప్ర‌త్యామ్నాయం ఫ‌లించ‌కుండడా పోయింది. ద‌రిమిలా.. గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి.. దేశ ఏలిక అయ్యే సువ‌ర్ణావ‌కాశాన్ని ప్ర‌తిప‌క్ష కూట‌ములు.. అడ‌క‌కుండానే అందించిన‌ట్టు అయింది.

ఇక‌, ఇప్ప‌టి ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మోడీని గ‌ద్దె దించాల‌ని.. కేంద్రంలో కాంగ్రెసేత‌ర‌, బీజేపీయేత‌ర ప్ర‌త్యామ్నాయ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని పిలుపు ఇస్తున్నా.. ఆ దిశ‌గా ఎవ‌రు అడుగులు వేసినా.. మేమే ముందున్నామ‌ని.. ప్ర‌క‌టిస్తున్నారే త‌ప్ప‌.. దానికి త‌గిన విధంగా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోలేక పోతున్నారు. కాగా, ఇప్పుడు మోడీకి ప్ర‌త్యామ్నాయంగా నిలువ‌గ‌ల స‌త్తా.. ఆయ‌న‌ను ఢీ కొట్టే తెగువ ఉన్న నాయ‌కురాలిగా బెంగాల్ సీఎం మ‌మ‌త ప్రొజెక్టు అవుతున్నారు. ఇంత‌కుమించి.. మోడీకి ప్ర‌త్యామ్నాయం లేద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే.. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మ‌మ‌త‌కు ల‌భిస్తున్న మ‌ద్ద‌తు మాత్రం అంతంత మాత్రంగానే ఉండ‌డం.. ఈశాన్య‌, ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఒకింత మెరుగైన ఆలోచ‌నే ఉన్న‌ప్ప‌టికీ.. తుదికంటా మ‌మ‌త‌కు ఎంత‌మంది మ‌ద్ద‌తుగా నిలుస్తార‌నేది చెప్ప‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. కానీ.. ఇప్ప‌టికిప్పుడు మోడీకి ప్ర‌త్యామ్నాయం ఎవ‌రైనా ఉంటే.. అది మ‌మ‌త అనే చెప్పొచ్చనేది.. నిర్వివాదాంశం.