సీనియర్ రాజకీయవేత్త, టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా… అది ఆసక్తిని రేకెత్తించేదే అయి ఉంటోంది. ఏం లేకున్నా కూడా జేసీ నోట నుంచి వచ్చే తూటాల్లాంటి మాటలు… ఆయన ఎంట్రీని వైరల్ గా మార్చేస్తున్నాయి. రాజకీయాలకు వీలునామా రాసిచ్చేశానంటూ జేసీ ఇప్పటికే ప్రకటించినా కూడా… ఆయన ఎక్కడ కనిపించినా కూడా హాట్ టాపిక్ గానే మారిపోతోంది. కరోనా వేళ… తన సొంతింటికే పరిమితమైపోయిన జేసీ… దిలాసాగా గడుతుపున్నారనుకుంటే మనం పొరబడినట్టే. ఎందుకంటే.. మంగళవారం కరోనాపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసిన జేసీ… బుధవారం బీజేపీకి చెందిన ఓ కీలక ఎంపీ, టీడీపీకి చెందిన ఓ కీలక నేతలతో తన సొంత వ్యవసాయ క్షేత్రంగా చెట్టుకింద వేసిన అరుగుపై పంచె ఎగ్గట్టి కూర్చుని చర్చలు జరిపారు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.
2019 దాకా టీడీపీలోనే ఉండి… మొన్నటి ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలో చేరిపోయిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్.. తన సొంత జిల్లా కడపకు చెందిన టీడీపీ కీలక నేత బీటెక్ రవిని వెంటేసుకుని జేసీ సొంతూరికి వెళ్లారు. వీరికి సాదర స్వాగతం పలికిన జేసీ…. వారిని తన ఫాం హౌజ్ కు తీసుకుని వెళ్లి మరీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అచ్చమైన పంచెకట్టులో కనిపించిన జేసీ… మోతుబరి రైతు మాదిరి సదరు పంచెను ఎగ్గట్టేసి సీఎం రమేశ్, బీటెక్ రవిలతో చర్చలు జరిపిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ఫొటోలను జేసీనే స్వయంగా తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.
సీఎం రమేశ్, బీటెక్ రవిలతో దాదాపుగా 3 గంటలకు పైగా చర్చలు జరిపిన జేసీ… సదరు చర్చల్లో అసలు రాజకీయాలే ప్రస్తావనకు రాలేదంటూ చెప్పుకొచ్చేశారు. కరోనా వేళ తన యోగ క్షేమాలు తెలుసుకునేందుకే వారిద్దరూ తన సొంతూరు జూటూరుకు వచ్చారని పేర్కొన్న జేసీ అనుయాయులు… తమ నేతతో వారికున్న అనుబంధమే వారిని ఇంత దూరం రప్పించిందని కూడా చెప్పేశారు. సరే… రాజకీయాలు ఏమీ లేకున్నా… అసలు అంతసేపే ఏం చర్చించారన్న విషయానికి వస్తే… జేసీ కొనసాగిస్తున్న ఫాం హౌజ్ లో సాగు తీరు, ప్రస్తుతం కలకలం రేపుతున్న కరోనా గురించిన అంశాలే వారి మధ్య చర్చకు వచ్చాయంట. సో… అసలు విషయం ఏమీ లేదని వారు చెబుతున్నా… ఈ భేటీలో ఏం జరిగిందన్నది త్వరలోనే బయటకు రాక మానదన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.