రాజీవ్ ఆన‌వాళ్లు లేకుండా.. ప్ర‌జ‌ల పేరుతో మోడీ ‘రాజ‌కీయం’

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం.. వ‌రుస విజ‌యాలు సాధించి.. కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే ఊపిరి స‌ల‌ప‌నీయ‌ని విధంగా ఇరుకున పెడుతోంది. అంతేకాదు.. బ‌ల‌మైన కాంగ్రెస్ కంచుకోట‌ల‌ను కూడా ద‌క్కించుకుని.. కాంగ్రెస్ ఉనికినే ప్ర‌శ్నార్థకం చేస్తోంది. క‌నుచూపు మేర‌లో.. కాంగ్రెస్ పుంజుకునే ప‌రిస్థితి లేకుండా ప్ర‌ధాని మోడీ- కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. వ్యూహాత్మ‌కంగా వేస్తున్న అడుగులు.. కాంగ్రెస్‌ను ఇప్ప‌టికే ఇర‌కాటంలోకి నెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ను మాత్ర‌మే కాకుండా.. కాంగ్రెస్ వెనుక ఉన్న గాంధీల కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని.. ఇప్ప‌టికే గాంధీల వార‌సుడు.. యువ నేత రాహుల్ గాంధీని ‘ప‌ప్పు’ను చేసేశారు.

ఈ ముద్ర నుంచి త‌ప్పించుకునేందుకు.. త‌ను యాక్టివ్ అయ్యేందుకు రాహుల్ ఎంత ప్ర‌య‌త్నిస్తున్నా.. సాధ్యం కాని రీతిలో మోడీ-షా ద్వ‌యం చేస్తున్న విన్యాసం.. రాహుల్ రాజ‌కీయ భ‌విత‌పై పెద్ద బండే వేస్తోంద‌న్న అభిప్రాయం జాతీయ రాజ‌కీయాల్లో వ్య‌క్త‌మ‌వు తోంది. ఇక‌, ఇప్పుడు మ‌రింత దూకుడుగా మోడీ, షా ద్వ‌యం వ్య‌వ‌హ‌రిస్తన్నార‌నే కామెంట్లు వ్య‌క్త‌మ‌వుతు న్నాయి. అస‌లు దేశ ప్ర‌స్థానంలోనే గాంధీల పేరు వినిపించ‌కుండా చేయాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారా? అనే సందేహాలు కూడా వ‌స్తున్నాయి.

తాజాగా మోడీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది. దాదాపు రెండు ద‌శాబ్దాల‌కు పైగా.. కొన‌సాగుతున్న ‘రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న‌’ వంటి ప్ర‌తిష్టాత్మ‌క పుర‌స్కారం పేరును మోడీ స‌ర్కారు మార్చేసింది. ఇది వాస్త‌వానికి రాజీవ్‌గాంధీ స్మృత్య‌ర్థం తీసుకువ‌చ్చిన పేరు మాత్ర‌మే కాదు.. రాజీవ్‌కు క్రీడ‌ల‌పై ఉన్న ఆస‌క్తికి గుర్తుగా ఆయ‌న‌కు అంజ‌లి ఘ‌టిస్తూ.. అప్ప‌టి ప్ర‌బుత్వం దీనిని ఏర్పాటు చేసింది. అప్ప‌టి నుంచి ప్ర‌తి ఏటా.. జాతీయ స్థాయిలో క్రీడ‌ల్లో అత్యుత్త‌మ ప్ర‌తిభ చూపిన వారికి ఈ అవార్డును ఇస్తున్నారు.

అంతేకాదు.. రాజీవ్ గాంధీ ఖేల్ ర‌త్న అందుకోవ‌డం.. క్రీడాకారుల జీవితంలో ఒక అద్భుత ఘ‌ట్టంగా బావిస్తుంటారు. అయితే.. ఈ అవార్డులో రాజీవ్ గాంధీ పేరు ఉండ‌డాన్ని మోడీ స‌హించ‌లేక పోతున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌జాభిప్రాయం పేరిట‌… ఆయ‌న తాజాగా.. దీనికి పేరు మార్చేశారు. హాకీలో అద్భుత ప్ర‌తిభ‌ను చూపిన మేజ‌ర్ ధ్యాన్ చంద్ పేరును ఈ అవార్డుకు పెడుతూ.. తాజాగా నిర్ణ‌యం ప్ర‌క‌టించారు. ధ్యాన్ చంద్ పేరు పెట్ట‌డం మంచిదే అయినా.. రాజీవ్ గాంధీ పేరును తీసేయ‌డం.. వెనుక రాజకీయ కార‌ణాలే ఉన్నాయ‌ని.. అంత‌కు మించి ఏమీలేవ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిపై కాంగ్రెస్ నేత‌లు, ముఖ్యంగా రాజీవ్ త‌న‌యుడు రాహుల్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.