హుజూరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి కేసీయార్ తీసుకున్న తాజా నిర్ణయంతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తరపున ఎవరిని పోటీలోకి దింపుతారనే విషయంలో చాలా పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఒకసారి రెడ్డి అభ్యర్ధని, మరోసారి బీసీనే దింపుతారన్నారు. చివరకు ఎస్సీకే టికెట్టిస్తారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఎవరిని రంగంలోకి దింపుతారనే విషయం కేసీయార్ కనీసం సూచన కూడా చేయలేదు.
ఇలాంటి నేపధ్యంలోనే నియోజకవర్గానికే చెందిన కౌశిక్ రెడ్డి ని గవర్నర్ కోటాలో ఎంఎల్సీగా కేసీయార్ ఎంపిక చేశారు. ఒకపుడు ఇదే కౌశిక్ టీఆర్ఎస్ తరపున పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది. కాంగ్రెస్ లో నుండి పదిరోజుల క్రితమే టీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ ఎంఎల్సీ అవటంతో ఉపఎన్నికలో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం లేదని తేలిపోయింది.
అలాగే ఇదే నియోజకవర్గానికి చెందిన బండ శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. ఈ నియామకాన్ని బట్టి చూస్తే ఎస్సీకి కూడా ఉపఎన్నికల్లో అవకాశం లేనట్లే అనిపిస్తోంది. ఒకవేళ ఎస్సీకే టికెట్ ఇవ్వాలని అనుకుంటే బండ కు కేసీయార్ టికెట్ ఇచ్చేవారు. ఎందుకంటే నియోజకవర్గంలో శ్రీనవాస్ కే గట్టి ఎస్సీ నేతగా పేరుంది. కాబట్టి బండ నియామకంతో ఎస్సీలకు కూడా అవకాశం లేదని తేలిపోయింది.
ఇక మిగిలింది బీసీ సామాజికవర్గమే. నియోజకవర్గంలో బీసీ ఓట్లు సుమారు లక్షకు పైగా ఉన్నాయి. బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్ ఎలాగూ బీసీనేతే. టీఆర్ఎస్ తరపున బీసీని రంగంలోకి దించకపోతే మొత్తం ఓట్లలో మెజారిటి ఈటలకు పడే అవకాశం ఉంది. కాబట్టి బీసీల ఓట్లలో చీలిక తెచ్చేందుకే కేసీయార్ ఇక్కడ బీసీ నేతనే రంగంలోకి దింపబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది.
కౌశిక్ రెడ్డిని ఎంఎల్సీని చేసినందుకు రెడ్డి ఓట్లు, ఎస్సీ నేతను ఛైర్మన్ చేసిందుకు ఎస్సీల ఓట్లు, బీసీకి టికెట్ ఇచ్చినందుకు బీసీల ఓట్లు+ అభివృద్ధి చేస్తున్నందుకు ఇతర సామాజికవర్గం ఓట్లు కూడా టీఆర్ఎస్ కే పడతాయని లేదా పడాలన్నది కేసీయార్ లాజిక్ లాగుంది. అందుకనే టీఆర్ఎస్ తరపున బీసీ నేతే పోటీలో ఉంటారనే ప్రచారం ఒక్కసారిగా పెరిగిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates