వైసీపీ నేత‌ల‌కు జ‌గ‌న్ ఇస్తున్న సందేశం ఇదే!

ప్ర‌జాప్ర‌తినిధులు అంటే.. ప్ర‌జ‌ల త‌ర‌ఫున త‌మ గ‌ళాన్ని వినిపించే నాయ‌కులు అనే క‌దా అర్ధం. అయితే.. ఈ అర్ధాన్ని వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. పూర్తి తుడిచిపెట్టేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌భుత్వం చేసే ప‌నులు కొంద‌రికి న‌చ్చొచ్చు.. మ‌రికొంద‌రికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ప్ర‌జాస్వామ్యంలో ఎవ‌రి భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ వారికి ఉంటుంది. అయితే.. ‘ఒక‌వైపే చూడండి!’అనేలా సీఎం జ‌గ‌న్ త‌న పార్టీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సందేశం ఇస్తున్నారు. అదికూడా ఏదో మామూలుగా మాట‌ల‌తో కాదు.. చేత‌ల‌తోనే వారిని హెచ్చ‌రిస్తున్నారు. ‘ఏమాత్రం తేడా వ‌చ్చినా.. ఆయ‌న లాగే.. మీరు కూడా!’ అంటూ.. ఓ ఎంపీ విష‌యంలో జ‌గ‌న్ బ‌ల‌మైన సంకేతాలు పంపుతున్నార‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు.

విష‌యంలోకి వెళ్తే.. రాజ‌ధాని విష‌యంలో సీఎం జ‌గ‌న్ చేసిన మూడు రాజ‌ధానుల‌ ప్ర‌తిపాద‌న‌పై నిజం చెప్పాలంటే.. సొంత పార్టీ లోనే వ్య‌తిరేకించే నాయ‌కులు చాలా మంది ఉన్నారు. గుంటూరు, కృష్ణా, ప్ర‌కాశం జిల్లాలు స‌హా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నేత‌లు.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిగానే ఉండాల‌ని వీరు కోరుకుంటున్నారు. అయితే.. పార్టీ అదినేత తీసుకున్న నిర్ణ‌యంతో ఎవ‌రూ విభేదించ‌లేక‌.. మౌనంగా ఉంటున్నారు. కానీ, ఒక ఎంపీ మాత్రం.. రాజ‌ధాని ప‌రిధిలో ఉండే.. త‌న నియోజ‌క‌వ‌ర్గం కింద ఉన్న మండ‌లాల్లో జ‌రుగుతున్న రాజ‌ధాని ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఇది జ‌రిగి చాన్నాళ్లే అయింది. అక్క‌డి రైతుల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. వారి క‌ష్టాల‌ను ఓపిగ్గా విన్నారు.

నిజానికి..అమ‌రావ‌తి ఉద్య‌మం ఉవ్వెత్తున సాగిన గ‌త ఏడాదికి ముందే స‌ద‌రు.. ఎంపీ.. రైతుల‌ను క‌లిసి.. ప‌రోక్షంగా వారి క‌ష్టాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఇదే ఇప్పుడు పెద్ద చిక్కు తెచ్చింది. ఇప్పుడు ఆ ఎంపీకి.. వైసీపీలో గౌర‌వం లేకుండా చేసేశారు. ఆయ‌న మాట‌ల‌ను ఎవ‌రూ వినిపించుకోవ‌డం లేదు. అస‌లు ఆయ‌న‌ను ఎంపీగా కూడా నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేలు ప‌రిగ‌ణించ‌డం లేదని వైసీపీలోనే చ‌ర్చ సాగుతోంది. ఇక‌, గ‌తంలో నెల‌కు ఒక‌సారి సీఎంవోకు వ‌చ్చి.. వెళ్లిన ఆయ‌న‌కు ఇప్పుడు సీఎంవోలొకి ఎంట్రీ కూడా లేకుండా పోయింది. అంతేకాదు.. ఇటీవ‌ల పార్ల‌మెంటు స‌మావేశ‌ల‌కు ముందు.. జ‌రిగిన పార్ల‌మెంట‌రీ ప‌క్ష స‌మావేశంలో ఆయ‌న‌కు ఆహ్వాన‌మే అంద‌లేదు.

అంతేకాదు.. ప‌రోక్షంగా ఆయ‌న‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నామ‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల స్ప‌ష్టం చేస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో స‌ద‌రు ఎంపీపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేస్తున్నారు. మ‌రికొంద‌రు గ‌తంలో స‌ద‌రు ఎంపీతో రాసుకుని పూసుకుని తిరిగినా.. ఇప్పుడు దూరం పెడుతున్నారు. ఎంపీ ప‌ర్య‌ట‌న‌కు కూడా దూరంగా ఉంటున్నారు. అధికార ప‌క్షం మీడియా ఎంపీని క‌లుసుకునేందుకు, ఆయ‌న కార్య‌క్ర‌మాల‌ను క‌వ‌ర్ చేసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదు. దీంతో స‌ద‌రు ఎంపీ ఒంట‌ర‌య్యార‌నే సంకేతాలు వైసీపీలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇదంతా కూడా రాజ‌ధాని విష‌యంలో త‌మ‌కు వ్య‌తిరేకంగా రైతుల‌ను క‌లిశార‌నే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యంగా చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఏ ఒక్క‌రూ కూడా అస‌లు రాజ‌ధాని పేరెత్త‌డానికి కానీ.. అటు వైపు ప్ర‌యాణించ‌డానికి కానీ హ‌డ‌లి పోతున్నార‌ట‌.