చంద్ర‌బాబు అడుగు పెట్ట‌గానే కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ ఆంధ్రాలో అడుగు పెట్టారు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం మొద‌ల‌వ‌గానే ఆయ‌న హైద‌రాబాద్‌కు వెళ్లిపోయి అక్క‌డే త‌న సొంతింట్లో ఉంటున్న సంగతి తెలిసిందే. వైర‌స్ వ్యాప్తి అంత‌కంత‌కూ పెరుగుతుండ‌టంతో తాను ఏపీకి వెళ్లి జ‌నాల్ని క‌ల‌వ‌డం వాళ్ల‌కు, త‌న‌కు మంచిది కాద‌ని ఆయ‌న భావించి ఉండొచ్చు. అందుకే అధికార ప‌క్షం నుంచి ఎంత‌గా క‌వ్వింపులు వ‌చ్చినా ఆయ‌న హైద‌రాబాద్ వీడ‌లేదు. ఇప్పుడు లాక్ డౌన్ స‌డ‌లింపులు రావ‌డంతో బాబు ఏపీకి బ‌య‌ల్దేరారు. ముందు విమానంలో వెళ్లాల‌నుకున్నారు. అందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో త‌న కాన్వాయ్‌లోనే సోమ‌వారం విజ‌య‌వాడ‌కు వెళ్లారు చంద్ర‌బాబు.

ఐతే బాబు రెండు నెల‌ల విరామం త‌ర్వాత ఏపీకి రావ‌డంతో ఆయ‌న అభిమానులు, తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున పోగై బాబుకు స్వాగ‌తం ప‌లికారు. దీంతో బాబు అండ్ లాక్ డౌన్ నిబంధ‌నలు ఉల్లంఘించిన‌ట్ల‌యింది. సంబంధిత ఫొటోలు, వీడియోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. బాబుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు కోర్టు వ‌ర‌కు వెళ్లింది. అనంత‌పురానికి చెందిన గోపాల్ రెడ్డి అనే లాయ‌ర్.. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి క‌రోనా వ్యాప్తికి కార‌ణ‌మైన చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ల‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని హైకోర్టులో రిట్ పిటిష‌న్ వేశారు. బాబు చేసిన ప‌ని త‌ప్పుడు సంకేతాలు ఇస్తుంద‌ని.. వేరే రాజ‌కీయ పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు కూడా ఇలాగే గుమిగూడితో ప‌రిస్థితి ఏంట‌ని పిటిష‌న్ దారు ప్ర‌శ్నించారు. ఈ పిటిష‌న్‌పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.