ఇండియాలో పెగాసస్ ఆగిపోతుందా ?

ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్న ఎన్ఎస్ఓ సెక్యూరిటి సంస్ధ కొన్నిదేశాల్లో పెగాసస్ సాఫ్ట్ వేర్ వినియోగాన్ని నిలిపేసింది. ఇజ్రాయెల్ కు చెందిన సైబర్ సెక్యూరిటి సంస్ధ ఎన్ఎన్ఓ అనేక దేశాలకు తన పెగాసస్ సాఫ్ట్ వేర్ ను అందించింది. అయితే కొన్ని దేశాల్లో తమ సాఫ్ట్ వేర్ ను దుర్వనియోగపరుస్తున్నారని వచ్చిన ఆరోపణల తర్వాత సేవలను నిలిపేసింది. అయితే ఏ ఏ దేశాల్లో తమ సేవలను నిలిపేశారనే విషయాన్ని మాత్రం ఎన్ఎస్ఓ బయటపెట్టలేదు.

ప్రపంచంలో ఇజ్రయెల్ ఇంటెలిజెన్స్ కున్న సామర్ధ్యం గురించి కొత్తగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆదేశంలోని ఎన్ఎస్ఓ సెక్యూరిటి సంస్ద సంఘ విద్రోహులు, ప్రభుత్వ మనుగడకు ముప్పుగా తయారైన సంస్ధలు, వ్యక్తుల కదలికలపై నిఘా వేయటానికి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను తయారుచేసింది. ఈ సఫ్ట్ వేర్ ను సదరు సంస్ధ కేవలం వివిధ దేశాల్లోని ప్రభుత్వాలకు మాత్రమే అమ్ముతుంది. అంటే వ్యక్తులకు, ప్రైవేటు సంస్ధలకు అమ్మదు. ప్రపంచంలోని 40 దేశాల్లోని 60

సంస్ధలు క్లైంట్లుగా ఉన్నారు.

పెగాసస్ సాఫ్ట్ వేర్ ను వివిధ దేశాల్లోని ఇంటెలిజెన్స్, మిలిటరీ, నిఘా సంస్ధలు మాత్రమే వాడుతున్నాయి. అయితే మామూలు వ్యక్తులపై తమ సాఫ్ట్ వేర్ ను ఉపయోగించటాన్ని సంస్ధ వ్యతిరేకం. ఇందులో భాగంగానే మనదేశంలో కూడా పెగాసస్ ను వాడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే సంస్ధ నిబంధనలకు విరుద్ధంగా మనదేశంలో ఇతర కార్యకలాపాలతో పాటు ప్రతిపక్ష నేతలు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులతో పాటు వివిధ రంగాల్లోని ప్రముఖుల మొబైళ్ళను కూడా కేంద్రప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని బయటపడింది.

ఎప్పుడైతే పెగాసస్ వ్యవహారం బయటపడిందో అప్పటినుండి రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతోంది. గడచిన రెండు వారాలుగా మొబైల్ ట్యాపింగ్ పై ఇంత గందరగోళం జరుగుతున్నా తాము సదరు సాఫ్ట్ వేర్ ను వాడుతున్నట్లు కేంద్రం మాత్రం అంగీకరించటంలేదు. అందుకనే కేంద్రంపై అనేక మంది ప్రముఖులు సుప్రింకోర్టులో కేసులు వేశారు. కేంద్రం పెగాసస్ ను వాడుతున్నట్లు అనధికారికంగా బయటపడింది. దాంతో సాఫ్ట్ వేర్ ఉపయోగంపై బ్యాన్ పెట్టాలని ఎన్ఎన్ఓ సంస్ధపై ఒత్తిడి పెరిగిపోతోంది. తమ సాఫ్ట్ వేర్ ను దుర్వినియోగం చేశారని ఆరోపణలున్న కొన్ని దేశాల్లో పెగాసస్ సేవలను యాజమాన్యం నిలిపేసింది. కాబట్టి తొందరలోనే ఇండియాలో కూడా సేవలు నిలిపేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది.