టీటీడీ భూముల అమ్మ‌కంపై యుట‌ర్న్?

తిరుమ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌రుడికి భ‌క్తులు ఇచ్చిన భూముల్ని అమ్మేందుకు రంగం సిద్ధం చేయడంపై తీవ్ర స్థాయిలో వ్య‌తిరేక‌త‌, విమ‌ర్శ‌లు రావడంతో టీటీడీ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లు క‌నిపిస్తోంది. భూముల అమ్మ‌కాల ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా నిలిపి వేసింది. భూముల అమ్మ‌కాల‌పై ఇంకా తుది నిర్ణ‌యం తీసుకోలేదంటూ బోర్డు ఛైర్మ‌న్ సుబ్బారెడ్డి మీడియాకు తెలిపారు. టీటీడీ భూముల అమ్మ‌కాల‌పై జాతీయ స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

టీటీడీ భూముల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, వేలానికి సంబంధించి ఎలాంటి విధివిధానాలూ రూపొందించలేదని.. ఈ లోపే కొందరు కావాల‌నే రాద్ధాంతం చేస్తున్నారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. టీటీడీ భూములు అమ్మాలంటే కేవలం రూ.కోటీ 53 లక్షల విలువైన భూములే అమ్మాల్సిన అవ‌స‌రం లేద‌ని.. తదుపరి బోర్డు సమావేశంలో భూముల విక్రయంపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని అయ‌న‌న్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న భూముల ప‌రిర‌క్ష‌ణ క‌ష్ట‌మ‌వుతుంద‌న్న ఉద్దేశంతోనే వాటిని అమ్మాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని సుబ్బారెడ్డి చెప్పారు.

అధికార బృందాన్ని పంపించి మార్కెట్‌ విలువ, అక్కడి పరిస్థితుల గురించి రోడ్డు మ్యాప్‌ తయారు చేయాలని మాత్రమే బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నామ‌ని.. వేలం వేయాలని ఎక్కడా ఉత్తర్వులు ఇవ్వలేదని సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు.

అన్యాక్రాంతమైన భూములు, నిరుపయోగంగా ఉన్న ఆస్తుల్నే అమ్మాల‌న్న ప్ర‌తిపాద‌న వ‌చ్చింద‌ని.. అది కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన చదలవాడ కృష్ణమూర్తి తితిదే ఛైర్మన్‌గా ఉన్నప్పుడే భూములు విక్రయించాలని తీర్మానం చేసిన‌ట్లు సుబ్బారెడ్డి గుర్తు చేశారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో సదావర్తి భూముల అమ్మకానికి పెడితే కోర్టుకెళ్లి అడ్డుకున్నది తామే అని.. టీటీడీకి భూముల విష‌యంలో ఉద్దేశం వేర‌ని సుబ్బారెడ్డి అన్నారు.