ఇటీవల టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న కౌశిక్ రెడ్డి.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు. గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ మేరకు కౌశిక్ రెడ్డి పేరును సిఫారసు చేస్తూ ప్రభుత్వం ఆమోదానికి గవర్నర్‌కు పంపింది.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కౌశిక్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి తన అనుచరులతో కలిసి గత నెల 21వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ కండువా కప్పిన సీఎం కేసీఆర్.. సాదరంగా పార్టీలోకి స్వాగతించారు. కౌశిక్ రెడ్డి మంచి రాజకీయ భవిష్యత్ ఉంటుందని అప్పుడే చెప్పారు. కౌశిక్ రెడ్డి తండ్రి సాయినాథ్‌రెడ్డి కూడా తనకు చిరకాల మిత్రుడని, తెలంగాణ ఉద్యమంలో సాయినాథ్‌రెడ్డి నాతో కలిసి పని చేశానని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డికి సీఎం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు కేసీఆర్.
అంతకుముందు హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందంటూ ఓ అనుచరుడితో కౌశిక్ రెడ్డి మాట్లాడిన ఆడియో టేప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. తదనంతర పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు.