నరేంద్రమోడికి మరో షాక్ తప్పేట్లు లేదు. పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ అంశంపై విచారణ చేయటానికి సుప్రింకోర్టు అంగీకరించింది. ఆగష్టు మొదటివారం నుండి ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ జరపనున్నట్లు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. గడచిన పదకొండు రోజులుగా పెగాసస్ వ్యవహారంతో పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లుపోతున్న విషయం అందరికీ తెలిసిందే.
ప్రతిపక్ష నేతల ఫోన్లతో పాటు ప్రముఖులు, జర్నలిస్టులు ఇలా మొత్తం 50 వేలమందికి పైగా మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తోందనే విషయం బయటపడింది. దివైర్ మీడియా బయటపెట్టిన వివరాల ఆధారంగా ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లో నానా గోల చేస్తున్నాయి. పెగాసస్ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోడి పార్లమెంటులో ప్రకటన చేయాలని, చర్చకు అనుమతించాలని ప్రతిపక్షాలు ఎంత డిమాండ్ చేస్తున్నా మోడి మాత్రం నోరిప్పటంలేదు.
మొబైల్ ట్యాపింగ్ అంశంపై విచారణ జరపేట్లుగా ఆదేశాలు జారీ చేయమన్నా మోడి పట్టించుకోవటంలేదు. ఇదే సమయంలో ట్యాపింగ్ అంశంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటి విచారణ జరపాలని డిసైడ్ చేస్తే బీజేపీ ఎంపిలు దాన్నీ జరగనీయకుండా అడ్డుకున్నారు. సో జరుగుతున్నది చూస్తుంటే ట్యాపింగ్ ఉత్త ఆరోపణలు మాత్రమే కాదని నూరుశాతం నిజమే అని జనాలకు అర్ధమైపోయింది.
ట్యాపింగ్ అంశంపై విచారణకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం వల్ల ఉపయోగం లేదని అర్ధమైపోవటంతో కొందరు ప్రముఖులతో పాటు పాత్రికేయులు కూడా సుప్రింకోర్టులో కేసులు వేశారు. సదరు కేసులను పరిశీలించిన సుప్రింకోర్టు విచారణకు స్వీకరించింది. ఆగష్టు మొదటివారంలో విచారణ మొదలుపెడతానని ప్రకటించింది. సుప్రింకోర్టు తాజా నిర్ణయంతో మోడికి ఇబ్బందులు తప్పేట్లు లేదనే అనిపిస్తోంది. ప్రతిపక్ష నేతలల డిమాండ్లను లెక్కచేయకపోయినా సుప్రింకోర్టు ఆదేశాలనైతే పాటించాల్సిందే కదా.
విచారణలో భాగంగా సంబంధిత రికార్డులను కోర్టుకు సబ్మిట్ చేయమని ఆదేశిస్తే కేంద్రం ఇబ్బందులో పడటం ఖాయం. ఆమధ్య కేంద్రం ఏకపక్షంగా రూపొందించిన మూడు వ్యవసాయ చట్టాల అమలును కూడా సుప్రింకోర్టే అడ్డుకుంది. అలాగే కరోనా వైరస్ తీవ్రత విషయంలో కూడా సుప్రింకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసిన తర్వాత కానీ కేంద్రంలో చలనంరాలేదు. కాబట్టి పెగాసస్ విషయంలో కూడా సుప్రింకోర్టు రూపంలో మోడికి షాక్ తప్పదనే అనిపిస్తోంది. ఎందుకంటే ట్యాపింగ్ కు గురైన మొబైళ్ళల్లో సుప్రింకోర్టు జస్టిస్ నెంబర్ కూడా ఉండటం కొసమెరుపనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates