మోడి ఎందుకు నోరు తెరవటం లేదు ?

ప్రధానమంత్రి నరేంద్రమోడి వ్యవహారశైలే చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతిపక్ష నేతలు, వివిధ సెక్టార్లలోని ప్రముఖులపై పెగాసస్ అనే సాఫ్ట్ వేర్ తో మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై పార్లమెంటులో నానా రచ్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభంరోజున అంటే 19వ తేదీనే పెగాసస్ వ్యవహారం మీడియాలో వచ్చింది. అప్పటికే మోడి సర్కార్ పై అనేకరకాలుగా మండిపోతున్న ప్రతిపక్షాలకు పెగాససన్ వ్యవహారం చక్కటి ఆయుధంగా దొరికింది.

అంటే గడచిన ఎనిమిది రోజులుగా పార్లమెంటు ఉభయసభలు అట్టుడుకిపోతున్నాయి. పార్లమెంటు లోపలా బయట ఇంత గోల జరుగుతున్నా మోడి మాత్రం నోరిప్పి మాట్లాడటంలేదు. పెగాసస్ ద్వారా మొబైల్ ఫోన్ల ట్యాపింగ్ అన్నది మోడి ఆమోదంలేకుండా జరిగే అవకాశమే లేదు. పైగా సాఫ్ట్ వేర్ కొనుగోలుకు కేంద్రం రు 300 కోట్లు ఖర్చుపెట్టిందనే వార్త సంచలనంగా మారింది. ఇంత గోల జరుగుతున్నా మోడి పార్లమెంటులో ఎందుకని సమాధానం చెప్పటంలేదు ?

సాఫ్ట్ వేర్ కొనుగోలు చేసి ప్రతిపక్ష నేతలు+ప్రముఖల మొబైళ్ళు హ్యాక్ చేశామనో లేకపోతే చేయలేదనో ఏదో ఓ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మోడిపై ఉంది. అయితే పెగాసస్ లాంటి కీలకమైన అంశంపై మోడి నోరిప్పకపోవటంతో దివైర్ మీడియాలో వచ్చిన ట్యాపింగ్ కథనాలు, ప్రతిపక్షాల ఆరోపణలు నిజమే అనుకునేందుకు అవకాశాలున్నాయి. గతంలో కూడా పెద్దనోట్లు రద్దు విషయంలో ప్రతిపక్షాలు ఎంత గోల చేసినా పార్లమెంటులో మోడి సమాధానం చెప్పలేదు.

ఇదే కాదు చాలా సందర్భాల్లో కీలకమైన అనేక విషయాలపై మోడి నోరిప్పటంలేదు. ఏ అంశంపైనైనా నిర్ణయం తీసుకోవటమే తప్ప దాని పర్యవసానాలపై జనాలకు జవాబు చెప్పాలని మోడి అనుకోకపోవటమే విచిత్రంగా ఉంది. అటు పార్లమెంటుకు ఇటు జనాలకు ఎవరికీ తాను జవాబుదారీని కానని బహుశా మోడి అనుకుంటున్నారేమో. కేంద్రం ఎప్పుడు ఆత్మరక్షణలో పడిపోయినా మోడి పలాయనవాదాన్నే నమ్ముకుంటున్నట్లున్నారు. నిర్ణయం తీసుకోవటం మొడి ఇష్టం. ప్రతిపక్షాలకు, జనాలకు సమాధానాలు చెప్పుకోవటం మంత్రుల బాధ్యతగా తయారైంది.