బండి సంజయ్‌కు ఈట‌ల ఎపిసోడ్ భారంగా మారిపోయిందా?

తెలంగాణ‌లో రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. వైఎస్ ష‌ర్మిల ఎంట్రీతో ఆస‌క్తిక‌రంగా మారిన రాజ‌కీయాలు మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో పీక్స్‌కు చేరాయి. తాజాగా మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ రాజీనామాతో ఇంకా ఉత్కంఠ‌ను క‌లిగిస్తున్నాయి. అయితే, ఈట‌ల రాజీనామా, త‌ద‌నంత‌ర ప‌రిణామాలు ఇందులో హైలెట్‌. ఈ ప‌రిణామాల్లో బీజేపీలో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఈ ఎపిసోడ్‌లో తాజాగా సంచ‌ల‌నంగా మారాయి.

మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన అనంత‌రం బీజేపీలో చేరడాన్ని పార్టీ నేతలు కొంద‌రు వ్యతిరేకించారు. ఇదే సమయంలో ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ ఉపఎన్నికల అనివార్యం అయ్యాయి. అయితే, ఆ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లు బీజేపీని వీడటం ఆస‌క్తిక‌రంగా మారింది. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కూడా బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన కూడా ఈటలను చేర్చుకుని తప్పు చేశారంటూ ప్రకటించారు. ఈటల రాజేందర్ అంశంలోనే పార్టీపై ఆరోపణలు చేశారు.

బీజేపీ నేత‌లు ప‌లువురు కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామాలు బీజేపీ నేత‌ల్లో ఆందోళ‌న‌కు కార‌ణంగా మారాయి. అయితే, రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకాన్ని తప్పు పట్టిన కొంతమంది ఇలాంటి ప‌రిణామాల‌ను సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేదంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ను వ్యతిరేకిస్తున్న నేతలు వలసలను ప్రోత్సహిస్తున్నారనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈట‌ల సాకుతో సంజయ్ దూకుడు బ్రేక్ వేసేందుకు వ్యూహం పన్నుతున్నారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ బండి సంజ‌య్ కు ఒకింత ఇబ్బందిక‌రంగా మారిందంటున్నారు.