మోడికి దీదీ షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోడి చేయాల్సిన పనిని పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ చేసి పెద్ద షాకే ఇచ్చారు. పార్లమెంటును గడచిన వారంరోజులుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ ద్వారా మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ ఆరోపణలు ఊపేస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షాల నేతలు, జడ్జీలు, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ లాంటి సుమారు లక్షమంది ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించిందని ది వైర్ అనే మీడియా బయటపెట్టింది.

దీనిపై మోడి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పార్లమెంటు లోపలా బయటా నానా గోల చేస్తున్నాయి. ఇలాంటి నేపధ్యంలోనే బెంగాల్లో ఎవరెవరి మొబైళ్ళను పెగాసస్ ద్వారా కేంద్రం ట్యాపింగ్ చేయించిదో తెలుసుకునేందుకు ఓ కమిటిని మమత నియమించటం సంచలనంగా మారింది. కోల్ కత్తా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జ్యోతిర్మయి భట్టాచార్య, సుప్రింకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ బీ లోకుర్ కమిటి పెగాసస్ ఆరోపణలను విచారిస్తుందని మమత ప్రకటించారు.

బెంగాల్లో ఎవరెవరి ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేయించదనే విషయాన్ని ద్విసభ్య కమిటి ఏ పద్దతిలో విచారిస్తుందనే విషయంలో ఎవరికీ క్లారిటి లేదు. ఎందుకంటే బెంగాల్లో మోడిని వ్యతిరేకించే నేతలు, ప్రముఖులంతా తమ మొబైళ్ళను కేంద్రం ట్యాపింగ్ చేయించిందనే అంటారు. అలాగే బీజేపీ ప్రముఖులేమో ట్యాపింగ్ జరగలేదని చెప్పేందుకే అవకాశం ఉంది. మరి పెగాసస్ ద్వారా ట్యాపింగ్ జరిగిందా లేదా అని తేలాలంటే కేంద్రం హోంశాఖ ఆధికారులో లేకపోతే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను హ్యాండిల్ చేస్తున్న శాఖ ఉన్నతాధికారులు కానీ సమాధానమివ్వాలి.

కేంద్రంలో పెగాసస్ ను హ్యాండిల్ చేస్తున్న ఉన్నతాధికారులు మమత అపాయింట్ చేసిన కమిటికి సహకరించే అవకాశంలేదు. అసలు ఈ కమిటికి కేంద్రంలోని ఉన్నతాధికారులను విచారించే అధికారం కూడా ఉండదు. మరి ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత కూడా దీదీ ద్విసభ్య కమిటిని ఎందుకు నియమించినట్లు ? అయితే ఇక్కడో మెలికుంది. కేంద్రం గనుక విచారణ కమీషన్ నియమిస్తే అదే అంశంపై రాష్ట్రప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం లేదు.

ఇదే సమయంలో ముందుగా ఏదైనా రాష్ట్రప్రభుత్వం గనుక విచారణకు ఆదేశిస్తే కేంద్రం విచారణ కమీషన్ను నియమించేందుకు లేదు. ఇపుడు మమత నియమించిన కమీషన్ బెంగాల్లో మాత్రమే విచారణ జరుపుతుంది. ఇదే కమీషన్ ఇతర రాష్ట్రాల్లో కూడా విచారణ చేయించాలని నిర్ణయిస్తే అప్పుడు విధిగా కేంద్రం విచారణ కమీషన్ను నియమించేల్సిందే. విచారణ కమీషన్ వేయటంలో మమత ఎత్తుగడ ఇదే.

ఎందుకంటే రాజకీయంగా మోడిని మరింత కార్నర్ చేయటానికే. బెంగాల్లో ఉండే సాఫ్ట్ వేర్ నిపుణులు కానీ లేదా టెక్నాలజీ నిపుణుల ద్వారా ఎవరెవరి మొబైళ్ళు ట్యాప్ అయ్యోయో చూస్తారు. తర్వాత ఇంతమంది ఫోన్లను కేంద్రం ట్యాప్ చేయించిందని ప్రకటిస్తారు. దాంతో ఇపుడు జరుగుతున్న రచ్చ మరింత పెద్దదవుతుంది. ఇపుడు పార్లమెంటుకు మాత్రమే పరిమితమైన రచ్చను దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. అప్పుడు మోడికి వ్యతిరేకంగా మంటలు మరింతగా మండుతాయి. రాజకీయంగా ప్రతిపక్షాలకైనా దీదీకి అయినా కావాల్సిందిదే. చూద్దాం ద్విసభ్య కమిటి ఏమి తేలుస్తుందో.