సమయానికి తగిన విధంగా స్పందిస్తేనే.. రాజకీయాల్లో పట్టు చిక్కుతుంది. ఎప్పుడు ఎక్కడ ఎలాంటి వ్యూహం వేయాలో.. దాంతో ముందుకు సాగాలి. మరి ఈ విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్.. విఫలమవుతున్నారా? పార్టీని నడిపించడం కష్టమని చెబు తున్న ఆయన.. పార్టీని నడిపించే అవకాశం చిక్కినా.. ఉద్దేశ పూర్వకంగా వదులుకుంటున్నారా?
పార్టీని బలోపేతం చేసేందుకు ఎలాంటి వ్యూహాలు అనుసరించకపోగా.. వచ్చిన అవకాశం కూడా చేజార్చుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీల కులు. వచ్చే ఎన్నికల నాటికి.. ఏపీలో యువత ప్రభావం ఎక్కువగా ఉండనుంది. 2021 జనాభా లెక్కల ప్రకారం(ఇంకా చేయలే దు).. యూత్ ఓటర్లు పెరుగుతారు.
సో.. యూత్‌ను మచ్చిక చేసుకునేందుకు మరోవైపు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. యువతకు ఎలాంటి కష్టం వచ్చినా.. నేనున్నానంటూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ముందుకు వస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో యువతకు ఇప్పుడు తమ సమస్యలు చెప్పుకొనేందుకు ఒక నాయకుడు అంటూ దొరికారనే వాదన వినిపిస్తోంది. మరి,ఏపీలో ప్రశ్నిస్తానంటూ.. వచ్చి.. ఇప్పటి వరకు ఎవరిని ప్రశ్నించారో.. కూడా చెప్పలేని పరిస్థితి పవన్ ఎదుర్కొంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
సరే! ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది. కనీసం ఇప్పటికైనా పవన్ ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత.. గడిచిన నెల రోజులుగా ఆందోళన చేస్తోంది. రోడ్డెక్కుతోంది. కొత్త జాబ్ క్యాలెండర్ కావాలని.. జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
వీరికి బాసటగా.. అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కానీ, జనసేన మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుండడంపై యువత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కేవలం కబుర్లతో పవన్.. యువతను ఆకట్టుకోలేరని, హైదరాబాద్‌లో కూర్చుని.. రెండు కామెంట్లు చేయడం వల్ల.. యువత ఆయన వైపు మొగ్గు చూపి ఓట్టేసే పరిస్థితి ఉండదని అంటున్నారు పరిశీలకులు.
ఇప్పుడు వచ్చిన సమయాన్ని.. సద్వినియోగం చేసుకుంటే.. పవన్‌కు పొలిటికల్‌గా హవా పెరుగుతుందని సూచిస్తున్నారు. సమయానికి తగిన విధంగా ఆయన ఇప్పుడు రోడ్డెక్కాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరి పవన్ వింటారా? లేదా? అనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates