టీడీపీకి దేవేంద‌ర్ గౌడ్ గుడ్ బై చెబుతారా?

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఉమ్మ‌డి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీక‌ర్ దేవేంద‌ర్ గౌడ్‌ మ‌రోసారి టీడీపీకి గుడ్ బై చెబుతారా? త్వ‌ర‌లోనే ఆయ‌న పార్టీ మారేందుకు రెడీగా ఉన్నారా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు. టీడీపీతో రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించిన దేవేంద‌ర్‌గౌడ్‌.. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా, త‌ర్వాత‌ చంద్ర‌బాబు హ‌యాంలో రెవెన్యూ, హోం శాఖ‌ల మంత్రిగా త‌ర్వాత‌ స్పీక‌ర్‌గా ప‌నిచేశారు.

త‌ర్వాత తెలంగాణ ఉద్య‌మం తెర‌మీదికి రావ‌డంతో ఆయ‌న సొంత కుంప‌టి పెట్టుకున్నారు. ‘న‌వ తెలంగాణ ప్ర‌జా పార్టీ’ పేరుతో పార్టీ పెట్టుకున్నారు. అయితే.. అది మూణ్ణాళ్ల ముచ్చ‌ట‌గా మారిపోయింది.

అనంత‌రం.. ఈ పార్టీని ప్ర‌జారాజ్యం పార్టీలో విలీనం చేశారు. అయితే.. పార్టీ 2009లో పెద్ద‌గా దూకుడు చూపించ‌లేదు. దీంతో కొన్నాళ్లు స్త‌బ్దుగా ఉన్నారు. అదేస‌మ‌యంలో తీవ్ర అనారోగ్యానికి గురై.. మ‌రికొన్నాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. మేడ్చ‌ల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడు సార్లు శాస‌న స‌భ‌కు ఎన్నికైన దేవేంద‌ర్‌గౌడ్ ఈ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టుంది. 2012లో తిరిగి టీడీపీలో చేరిన ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని పొందారు.

ఇక‌, అప్ప‌టి నుంచి టీడీపీలోనే ఉన్న‌ప్ప‌టికీ.. పెద్ద‌గా యాక్టివ్ కాలేక పోయారు. 2018లో ఆయ‌న కుమారుడిని రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ఆయ‌న త‌న‌యుడు వీరేంద‌ర్ గౌడ్ ఓడిపోయాడు.

అయితే.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఇబ్బందిగా ఉంది. కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రుగా పార్టీ మారుతున్నారు. ఈ క్ర‌మం లో తాజాగా కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్‌రెడ్డి దేవేంద‌ర్ గౌడ్‌ను క‌ల‌వ‌డం.. పార్టీలోకి ఆహ్వానించిన‌ట్టుగా వార్త‌లు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. దేవేందర్ గౌడ్‌ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చామని రేవంత్ చెప్పినా.. ప్ర‌స్తుతం రాజ‌కీయంగా స్త‌బ్దుగా ఉన్న ఆయ‌న‌ను పార్టీలోకి తీసుకునే వ్యూహంతోనే రేవంత్ పావులు క‌దిపార‌ని తెలుస్తోంది.

తెలంగాణ‌లోని గౌడ సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను కాంగ్రెస్ వైపు మ‌ళ్లించే వ్యూహం ఉంద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్‌.. దేవేంద‌ర్ గౌడ్ వంటి కీల‌క నేత‌ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించార‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దేవేంద‌ర్‌గౌడ్ మ‌ళ్లీ పార్టీ మార‌తారా? కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.