రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడుకు అనుబంధంగా నిర్మించాలని భావిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వంతో పాటు.. విపక్షాలు సైతం విమర్శిస్తున్నాయి. తమ ప్రయోజనాల్ని దెబ్బ తీస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని కేసీఆర్ మొదలు విపక్ష నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటివేళలో.. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి 2 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఇవ్వాలని ఏపీ కోరటం ఆసక్తికరంగా మారింది.
సాధారణంగా రెండు రాష్ట్రాల మధ్య జల పంచాయితీ జరుగుతున్న వేళ.. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు ముందుకు వెళ్లవు. అందుకు భిన్నమైన సీన్ ఒకటి తాజాగా చోటు చేసుకుంది. నాగార్జునసాగర్ కుడి కాలువకు మే చివరి వరకూ 2 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఏపీ భావించింది. ఈ విషయాన్ని తెలంగాణ సర్కారుకు తెలియజేసింది. అయితే.. ఇప్పటికే ఏపీకి కేటాయించిన వాటాను పూర్తిగా వాడేశారన్నది తెలంగాణ సర్కారు వాదన. దీనిపై ఏపీ వాదన మరోలా ఉంది.
దీంతో.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక అధికారులు క్రిష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశానికి హాజరయ్యారు. కేటాయించిన వాటాకు మించి ఏపీ నీటిని ఖర్చు చేసినట్లుగా తెలంగాణ అధికారులు ఆరోపిస్తే.. అందులో నిజం లేదని ఏపీ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులు వినిపించిన వాదనలతో తెలంగాణ అధికారులు మౌనం వహించినట్లుగా చెబుతున్నారు.
వరద జలాల వినియోగంపై తెలంగాణ అధికారుల వాదనకు ఏపీ అధికారులు బలమైన కౌంటర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అసలు వరద జలాలకు లెక్కలు ఏమిటి? వరద జలాల్ని వాటాల కింద ఎలా లెక్కిస్తారు? వరద జలాలపై దిగువ రాష్ట్రాలకు హక్కు ఉంటుందన్న వాదనను ఏపీ అధికారులు వినిపించినట్లుగా సమాచారం. అంతేకాదు.. తెలంగాణ వినియోగించిన నీటి లెక్కల్ని చూడాలని చెప్పినట్లు తెలుస్తోంది.
దీంతో.. తాగునీటి అవసరాలు కావటం.. ఏపీ అధికారులు వినిపించిన వాదనల్లో పస ఉండటంతో తెలంగాణ అధికారులు సైతం ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. 2 టీఎంసీల నీటిని ఏపీ వినియోగించేందుకు వీలుగా సానుకూల నిర్ణయం వెలువడినట్లు చెబుతున్నారు. మొత్తంగా వివాదం వేళలోనూ సమర్థమైన వాదనను వినిపించటం ద్వారా తమ అవసరాలను తీర్చుకునేలా నీటి వినియోగానికి అనుమతిని సాధించుకోగలిగినట్లుగా తెలుస్తోంది.