కేటీఆర్ ఎవరో తనకు తెలీదన్నారు.. వైఎస్ షర్మిల. తన పార్టీనేతలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె.. తెలంగాణ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. ఈ క్రమంలో.. తనకు అసలు కేటీఆర్ ఎవరో తనకు తెలీదంటూ ఆమె మాట్లాడటం గమనార్హం.
కేటీఆర్ గురించి మీడియా మిత్రులు ఏదో ప్రశ్న లేవనెత్తగా.. అసలు కేటీఆర్ అంటే ఎవరు..? ఆయన ఎవరో తనకు తెలియదన్నట్లుగా షర్మిల మాట్లాడారు. కేటీఆరా.. అంటే ఆయనెవరు..? అని షర్మిల అన్నారు. అయితే.. పక్కనుండే మరో నేత.. ఆయనే మేడమ్.. కల్వకుంట్ల తారకరామారావు అని చెప్పగా.. ఓహ్.. కేసీఆర్ గారి కొడుకా అంటూ నవ్వడం గమనార్హం.
ఆ తర్వాత.. కేసీఆర్ మహిళలకు గౌరవం ఇవ్వడం లేదని.. ఇక ఆయన కుమారుడు మాత్రం ఏం గౌరవం ఇస్తాడని ప్రశ్నించారు. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఎంత మంది మహిళలు ఉన్నారని.. వారిలో ఎంత మందికి పదవులు దక్కాయని ఆమె ప్రశ్నించారు.
‘ఒక్క మహిళైనా మంత్రిగా ఉన్నారా..? ఒకరున్నారు సరే.. ఆమె టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచారా..? లేకుంటే పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా..?. వీళ్లా మహిళల గురించి మాట్లాడేది. కేటీఆర్ గారి దృష్టిలో మహిళలు అంటే వంటింట్లో ఉండాలి.. వ్రతాలు చేసుకోవాలనేగా అర్థం.. అంతేనా..?. అధికార పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడైనా మహిళలు కనిపిస్తారా..? ఒక మహిళా సర్పంచ్ వస్తే ఆమెకు ఒక్క కుర్చీ అయినా వేశారా..?. అసలు మనం ఏ శతాబ్ధంలో బతుకుతున్నాం’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates