అప్పు పుట్టించు మహాదేవా… ?


జగన్ సర్కార్ ఇపుడు మొక్కుకుంటున్నది ఒకటే ఒక్కటి. కొత్త అప్పు పుట్టించు అంటూ దేవదేవుళ్ళను వేడుకుంటోంది. నిజానికి అప్పులతోనే రెండేళ్ళుగా బండి నెట్టుకొచ్చిన వైసీపీకి ఇపుడు అన్ని రకాలుగా దారులు మూసుకుపోయాయి. కేంద్రం విధించిన రుణ పరిమితితో ఇక అప్పు పుడితే ఒట్టు అన్నట్లుగా సీన్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్ర‌భుత్వ ఉద్యోగుల జీతాలు కూడా వారం ప‌ది రోజులు ఆల‌స్య‌మ‌య్యే ప‌రిస్థితి. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. రాష్ట్రాలకే రుణ పరిమితులు. కేంద్రానికి ఎక్కడా లేవు. అంటే తనకు నచ్చినంతగా తెచ్చుకోవవచ్చు. అసలే రెండు దఫాలుగా వచ్చిన కరోనాతో ఏపీ లాంటి రాష్ట్రాలు పూర్తిగా చితికిపోయాయి.

ఇలా ఇబ్బంది పడుతున్న వేళ నిధులు ఎక్కువగా ఇచ్చి కేంద్రం ఆదుకోవాలి. కానీ కేంద్రం ఆ పని చేయడంలేదు. పోనీ అప్పులు అయినా చేసుకుంటామంటే ఒప్పుకోవడంలేదు. నానారకాలైన షరతులు పెడుతోంది. ఇక జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల ఏపీకి వ‌చ్చే రాబ‌డిలో భారీ కోత ప‌డింది. ఈ పరిణామాలు చూస్తూంటే ఏపీలో టీడీపీకి అనుకూలంగా కేంద్రంలోని బీజేపీ రాజకీయ నిర్ణయం తీసుకుందా అన్న చర్చ కూడా ఉంది. జగన్ పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు ఆగిపోవాలన్నది విపక్షాల కోరిక. అలా జరిగితేనే జనంలో జగన్ మీద వ్యతిరేక భావన వస్తుంది. అపుడే తమ రాజకీయ రధం ముందుకు కదులుతుంది.

దాంతో ఈ మధ్యనే బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు కూడా ఏపీలో అప్పులు పెద్ద ఎత్తున చేస్తున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇక అప్పు చేసి పప్పు కూడా గొప్ప ఏమీ కాదు అంటూ టీడీపీ నేతలు కూడా సెటైర్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది డిసెంబర్ నాటి దాకా కొత్త అప్పులు పుట్టకుండా ఉన్న అవకాశాలు అన్నీ ఏపీ సర్కార్ వాడేసుకుంది. మరో వైపు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు కూడా సవ్యంగా ఇవ్వలేని పరిస్థితి ఉంది. అటు ప్ర‌భుత్వ ఉద్యోగుల్లో ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

దీంతో అప్పుల కోసం ఏపీ సర్కార్ తెగ ప్రయత్నాలు చేస్తోంది. చిత్రమేంటి అంటే అధిక వడ్డీలు ఇస్తామన్నా కూడా ఎక్కడా కూడా పైసా అప్పు పుట్టకపోవడం. మరి ఇలాగైతే ఏపీలో పాలన ఎట్టా సాగేనో అర్థం కాని ప‌రిస్థితి. జగన్ అనుకున్న పనులు ఎలా జరిగేను అన్న చర్చ వస్తోంది. మొత్తానికి చూస్తే జగన్ సర్కార్ అతి పెద్ద అప్పుల‌ చట్రంలో ఇరుక్కుపోయింది అనే చెప్పాలి.