అనేక చర్చోపర్చలు, ఆసక్తికర పరిణామాల తర్వాత టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి నియామకం పూర్తయిన సంగతి తెలిసిందే. పలువురు నేతలు ఈ నియామకంపై తమ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం వారిని వ్యక్తిగతంగా కలిసిన రేవంత్ ఈ మేరకు కలిసికట్టుగా పనిచేసేందుకు ఒప్పించారు. ఇలా ఐక్యతారాగం వినిపించడంలో విజయం సాధించిన రేవంత్ ఇప్పుడు ఢిల్లీ పెద్దలను ఖుష్ చేసే పనిలో పడ్డారు. దీనికి తెలంగాణ జన సమితి రథసారథి ప్రొఫెసర్ కోదండరాం మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రొఫెసర్ కోదండరాం సారథ్యంలోని తెలంగాణ జన సమితి కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందని ప్రచారం జరుగుతోంది. గతంలోనే కోదండరాంతో రేవంత్ చర్చలు జరిపినట్లు సమాచారం. రేవంత్ సూచనతోనే గతంలో కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించడానికి కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఈటల వద్దకు కోదండరాం వెళ్లినట్లు చెప్తున్నారు. రేవంత్ అధ్యక్షుడు అయితేనే విలీనం / పొత్తు పై ఆలోచన చేద్దామని గతంలో తన పార్టీ సహచరులతో కోదండరాం చెప్పినట్లు సైతం ఈ ప్రచారం జరుగుతుండటం విశేషం. అధిష్టానంతో చర్చించి రేవంత్ నిర్ణయం తీసుకున్న తర్వాత విలీనానికి సంబంధించి తదుపరి చర్చలు ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ ఆదిలోనే అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం పోటీ పడటం సహజమని.. నిర్ణయం అయిపోయింది కాబట్టి, పార్టీని అధికారంలోకి వచ్చేలా అందరం కలిసి కృషి చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడంటే, సోనియా.. రాహుల్ గాంధీలు ఉన్నట్టేనని తెలిపారు. సోనియాగాంధీ ఆదేశాల మేరకు కలిసి పని చేస్తామన్నారు. వ్యక్తిగత అభిప్రాయం ఏది ఉన్నా.. అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. మేము కొట్లడుడు బంద్ చేసి.. ఇక ప్రభుత్వం మీద కొట్లాడుతామని జగ్గారెడ్డి ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.