ఆంధ్రా గ్రీన్స్… ఈ-కామర్స్ లో ఏపీ సర్కారీ సైట్

విశ్వవ్యాప్తంగా ఇప్పుడు అంతా ఈ- కామర్స్ మంత్రం అమలు అమలవుతోంది. అందుకు మన దేశం కూడా మినహాయింపేమీ కాదు. అయితే ఎన్ని దేశాల్లో ఈ-కామర్స్ సైట్లు ఉన్నా అన్నీ ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నవే. అయితే ఈ రంగంలో నవ్యాంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు నవ శకానికి నాందీ పలికింది.

ఇప్పటిదాకా ఏ ఒక్కరూ అమలు చేయని విధంగా ‘ఆంధ్రా గ్రీన్స్’ పేరిట ఈ- కామర్స్ రంగంలో పక్కా సర్కారీ వెబ్ సైట్ ను ఆవిష్కరించేసింది. ఈ సైట్ తో ఉభయతారకంగా అటు రైతులతో పాటు ఇటు వినియోగదారుడికీ సేవలందించేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఆంధ్రా గ్రీన్స్ సైట్ ను బుధవారం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సైట్ ద్వారా ఏపీ ప్రభుత్వం రైతుల ఉత్పత్తుల విక్రయం, వినియోగదారుడి ఇంటి ముంగిటకే ఆయా వస్తువులను చేర్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఆంధ్రాగ్రీన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌ జరుగుతుందట. రైతులు తమ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఉంచటంతో పాటు వినియోగదారులు కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు నమోదు చేసుకునే విధంగా దీన్ని రూపొందించారట.

కరోనా కారణంగా రైతుల ఉత్పత్తుల విక్రయాలకు ఇబ్బందులు వచ్చిన కారణంగా.. ఈ సమస్యను పరిష్కరించేందుకే ఆన్‌లైన్ మార్కెటింగ్ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందట.

రాష్ట్రంలో ఇప్పటికే స్విగ్గీ, జొమాటో ద్వారా పండ్లు, కూరగాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఇకపై ఆంధ్రా గ్రీన్స్‌ కూడా ఈ తరహా సేవలు అందిస్తుందట. ఆంధ్రా గ్రీన్స్ వెబ్‌సైట్లో మామిడి, బత్తాయి, అరటి, దానిమ్మ పండ్లతో పాటు ఎండు మిర్చి, కారం, పసుపు వంటి ఆహార ఉత్పత్తులను కూడా హోమ్ డెలివరీ చేస్తారట. రైతుల నుంచి పండ్లు, కూరగాయలు, ఇతర ఉత్పత్తులను సేకరించి.. ప్రభుత్వం అప్రూవ్ చేసిన ప్యాక్ హౌస్‌లో వాటిని ప్యాక్ చేస్తారు.

అక్కడి నుంచి వినియోగదారులకు డెలివరీ చేస్తారు. ప్రస్తుతం ఈ సేవలు విజయవాడ, వైజాగ్, గుంటూరు, హైదరాబాద్, బెంగళూరు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే ఇతర ప్రాంతాలకు కూడా వీటిని విస్తరిస్తామని కన్నబాబు చెప్పుకొచ్చారు.