గతంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్, అప్పుడు టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేసిన విషయం తెలిసిందే. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున పాదయాత్ర చేశారు. ఇక ఆ పాదయాత్ర ద్వారానే జగన్ ప్రజలకు దగ్గరయ్యారు. అప్పుడు ఏ సమస్య ఉన్న జగన్ అన్న ఉన్నారనే విధంగా రాజకీయం నడిచింది. జగన్ అన్న అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తొలగిపోతాయి అనేలాగా వైసీపీ కార్యకర్తలుగానీ, నేతలుగానీ ప్రచారం చేశారు. జగన్ సైతం ప్రజల చేత అన్న అని పిలిపించుకుని వారికి మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేశారు.
అలా దగ్గరవ్వడం వల్లే గత ఎన్నికల్లో జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఇలా గెలిచిన జగన్ ప్రజలకు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందిస్తున్నారు. ఇక ఇందులో ‘జగనన్న’ అనే ట్యాగ్ అని వదలడం లేదు. చాలా పథకాలకు జగనన్న అనే పేరు ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇలా జగనన్న పేరుతో జగన్ బాగానే సక్సెస్ అయ్యారు. అయితే ఇదే సక్సెస్ ఫార్ములాని లోకేష్ కూడా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది.
గతంలో కంటే లోకేష్ వైఖరి ఇప్పుడు చాలా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడుతున్నారు. ఎలాంటి తడబాటు లేకుండా స్పీచ్‌లు ఇస్తున్నారు. ఆఖరికి బాడీ లాంగ్వేజ్ కూడా మార్చారు. ఇలా మారిన లోకేష్, ప్రజల సమస్యలపై కూడా బాగానే పోరాటం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని విద్యార్ధుల తరుపున గట్టిగా పోరాడారు. విద్యార్ధుల చేత అన్న అని పిలిపించుకుంటూ ముందుకెళ్లారు.
అయితే సుప్రీం తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పరీక్షలని రద్దు చేసింది. సుప్రీం తీర్పుతో వెనక్కి తగ్గినా సరే, ఈ విషయంలో లోకేష్‌కు కాస్త ప్లస్ అయింది. పరీక్షలు రద్దు అయ్యాక టీడీపీ నాయకులు, కార్యకర్తలు థాంక్యూ లోకేష్ అన్న పేరిట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అంటే లోకేష్ సైతం అన్న అనే బ్రాండ్‌ని తగిలించుకున్నారు. అంటే ప్రజలకు ఏ సమస్య ఉన్న లోకేష్ అన్న ఉన్నాడనే విధంగా టీడీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. మరి ఈ అన్న అనే ట్యాగ్ లోకేష్‌కు ఏ మేర సక్సెస్ తీసుకొస్తుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates