చట్టం ముందు అందరూ సమానులే. ఏ ఒక్కరు తక్కువ కాదు. ఏ ఒక్కరు ఎక్కువ కాదు. అయితే.. అవన్నీ పుస్తకాల్లో మాత్రమేనా? అన్న అనుమానం కలిగేలా ఈ ఉదంతం ఉంటుంది. ఈ ఫోటోలోని భారీ భవనాన్ని చూశారుగా. చూసేందుకు ఏదో రాజ్ మహాల్ కు తీసిపోని రీతిలో నిర్మించిన ఈ భవనం ఏమిటో తెలుసా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చదువుకున్న స్కూల్. ఆ మధ్యన శిధిలావస్థకు చేరుకున్న భవనాన్ని కూల్చేసి.. భారీ భవనాన్ని నిర్మించారు. త్వరలో దీన్ని ప్రారంభించనున్నారు. ఇందుకోసం రూ.10.5 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు.
ముఖ్యమంత్రి పుట్టిన ఊరు.. ముఖ్యమంత్రి నివాసం ఉన్న ఊరు.. సీఎం దత్తత తీసుకున్న ఊరు.. సీఎం మనసు దోచిన ఊరు.. ప్రాంతం మాత్రమే డెవలప్ కావటంలో అర్థం లేదు. అభివృద్ధి అన్నది అందరికి సమానంగా పంపిణీ కావాలి. ఈ మధ్యనే తాను దత్తత తీసుకున్న ఊళ్లోని ప్రతి ఒక్కరికి రూ.10లక్షల మేర మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటానని తెలంగాణ సీఎం కేసీఆర్ సగర్వంగా ప్రకటించారు.
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు.. తమకు నచ్చిన వాటి విషయంలో అభిమానం పాళ్లు కాస్త ఎక్కువగా ప్రదర్శిస్తారు. అలా అని.. ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేయటం సరైనది కాదు. సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో తాను చదువుకున్న బడిని అత్యద్భుతంగా తీర్చిదిద్దటాన్ని ఎవరైనా అభినందిస్తారు.కాకుంటే.. తన సొంత నిధుల్ని ఇందుకోసం వినియోగించి ఉంటే బాగుండేది. అందుకు భిన్నంగా ప్రజల పన్ను సొమ్ముల్ని ఖర్చు చేయటంపైనే అభ్యంతరమంతా. రోమ్ శిల్ప కళా నమూనాలో నిర్మించిన ఈ రాజ్ మహాల్ లో ఉన్నత పాఠశాలతో పాటు జూనియర్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారు.
మొత్తం 28 క్లాస్ రూంలు.. ల్యాబ్స్.. లైబ్రరీతో పాటు మీటింగ్ హాల్ ను నిర్మించారు. ఒకేసారి 250 మంది పిల్లలు వాడేందుకు అనువుగు మరుగుదొడ్లను ఈ రాజ్ మహాల్ లో ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కూల్లో ప్రాథమిక విద్య నుంచి తొమ్మిదో తరగతి వరకు ఇక్కడే చదువుకున్నారు. తాను చదువుకున్న స్కూల్ గురించి.. తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల గురించి కేసీఆర్ తరచూ ప్రస్తావించటం.. వారి పేర్లను తన ప్రసంగాల్లో చెప్పటం తెలిసిందే. త్వరలో ఈ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ భవనం రేంజ్ కు తగ్గట్లు.. ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రా మజాకానా!