సీనియ‌ర్లు లేని కాంగ్రెస్ సామ్రాజ్యం..!

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏడేళ్ల కింద‌ట ప‌ట్టిన గ్ర‌హణం ఇప్ప‌టి వ‌ర‌కు విడ‌వ‌లేదు. ఈ పార్టీలో ఒక‌ప్పుడు సీనియ‌ర్లుగా చ‌క్రం తిప్పిన వారు.. చాలా మంది పార్టీ మారిపోయారు. ఇక‌, కొంద‌రు ఏకంగా రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నారు. మిగిలిన వారిలోనూ సీనియ‌ర్లు.. చాలా మంది త‌ట‌స్థంగా ఉంటున్నారే త‌ప్ప పార్టీ వాయిస్ వినిపించ‌డం లేదు. దీంతో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఏ పార్టీకైనా ఒడిదుడుకులు త‌ప్ప‌వు. అలాగ‌ని.. క‌ష్టాలు పూర్తిగా ఉంటాయా ? అంటే.. అది కూడా క‌ష్ట‌మే. ఎందుకంటే.. అస‌లు ఏమీ లేని స్టేజ్ నుంచి టీడీపీ అనేక‌సార్లు విజ‌యం ద‌క్కించుకుంది.

ఇక‌, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలోనూ ఈ త‌ర‌హా ప‌రిణామాలు కామ‌నే అని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయిన‌ప్ప‌టికీ.. సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా పార్టీ ని ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇటీవ‌ల పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ ఆస‌క్తిక‌ర విష‌యం తెచ్చారు. ఉన్నవారితోనే పార్టీ ముందుకు న‌డుస్తుంద‌ని, ఆయ‌న నొక్కి వ‌క్కాణించారు. చిరంజీవి పార్టీకి దూరంగా ఉన్నార‌ని.. అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న ఒకింత అస‌హ‌నంతోనే ఈ స‌మాధానం చెప్పి ఉంటారు. కానీ, ఆయ‌న చెప్పిన‌ట్టే.. ఉన్న‌వారితోనే పార్టీని న‌డిపిస్తామంటే.. ఇప్పుడు ఉన్న‌వారిలో ప్ర‌జాద‌ర‌ణ ఉన్న నాయ‌కులు. ప్ర‌జ‌ల్లో గెలుపు గుర్రం ఎక్కిన నాయ‌కులు వేళ్ల మీద లెక్కించాల్సిన ప‌రిస్థితి ఉంది.

ఈ గతంలో.. పార్టీని ప‌రుగులు పెట్టించిన‌, త‌మ‌దైన శైలిలో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌కంగా ఉన్న నేత‌లు.. కనుమూరి బాపిరాజు, కిర‌ణ్‌కుమార్‌రెడ్డి, ప‌ల్లంరాజు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, చింతా మోహ‌న్ (గ‌త తిరుప‌తి ఉప ఎన్నిక‌లో పోటీ చేసినా.. త‌ర్వాత ఎవ‌రితోనూ ఆయ‌న క‌ల‌వ‌డం లేదు), డీఎల్ ర‌వీంద్రారెడ్డి, ర‌ఘువీరారెడ్డి (పార్టీకి దూరంగా ఉంటున్నారు), సుబ్బి రామిరెడ్డి వంటివారు కాంగ్రెస్‌కు అంత్యంత సానుభూతి ప‌రులు. వీరు కూడా ఇప్పుడు పార్టీకి దూరంగా ఉంటున్నారు. అలాగ‌ని వేరే పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. మ‌రి ఇలాంటి వారిని కూడా దూరం చేసుకుంటే ప‌రిస్థితి ఏంటి.

ఇక‌, కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి యువ‌త‌ను ఆక‌ట్టుకునేందుకు, మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు ఉన్న క‌మిటీలు.. యూత్ కాంగ్రెస్‌, మ‌హిళా కాంగ్రెస్‌.. లు ఏపీలో లేనేలేవు. విచిత్రం ఏంటంటే ఉన్నంత‌లో రాష్ట్ర మ‌హిళా కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉన్న సుంక‌ర ప‌ద్మ‌శ్రీ మాత్రం ఫైర్‌బ్రాండ్‌గా జ‌గ‌న్, బీజేపీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంత‌కు మించి ఆ పార్టీలో మాట్లాడే వారు ఎవ్వ‌రూ లేరు. మ‌రి ఇలా అయితే.. పార్టీ న‌డిచేనా..? వ‌చ్చే ఎన్నిక‌ల నాటికైనా.. పార్టీ ఒడ్డుకు చేరేనా ? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కాంగ్రెస్‌లోనే ఉంటూ.. వైసీపీ సానుభూతిప‌రులుగా ప‌నులు చేయించుకునేవారు మ‌రికొంద‌రు ఉన్నారు. మ‌రి వీరి ప‌రిస్థితి ఏంటి ? ఇలా అనేక చిక్కుముళ్లు కాంగ్రెస్‌ను వేధిస్తున్నాయ‌నేది వాస్త‌వం.