గుంటూరు జిల్లాలో వైసీపీది వాపేనా..?

అత్యంత కీల‌క‌మైన‌.. గుంటూరు జిల్లాలో అధికార పార్టీ ప‌రిస్థితి మేడిపండేనా ? .. ఇక్క‌డ బ‌ల‌ప‌డ్డాం.. ఇంకేముంది.. టీడీపీ కూసాలు క‌దిలిపోవ‌డం ఖాయం అని.. వైసీపీ నేత‌లు భావిస్తే.. భావించి ఉండొచ్చు. కానీ, వాస్త‌వ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. మాత్రం దీనికి భిన్నంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గుంటూరు జిల్లాలో టీడీపీకి మ‌ద్ద‌తుదారులు ఎక్కువ‌. ఇక్క‌డ నేత‌లు చాలా మంది వ‌రుస‌గా విజ‌యాలు సాధించారు. దీంతో .. టీడీపీకి 2014లో ఎక్క‌వ సీట్లు ల‌భించాయి. అదే స‌మ‌యంలో రెండు ఎంపీ స్థానాలు కూడా టీడీపీ ఖాతాలో ప‌డ్డాయి. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్క‌డ దూకుడు ప్ర‌దర్శించింది.

ఈ క్ర‌మంలో ఒక ఎంపీ స్థానం స‌హా.. ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంది. నిజానికి ఒక ర‌కంగా.. గుంటూరులో వైసీపీ ఇంత రేంజ్‌లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం.. రికార్డ‌నే చెప్పాలి. ఎందుకంటే.. టీడీపీ హ‌యాంలో గుంటూరులోని అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. ఇక్క‌డ వంద అడుగుల అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. అదే స‌మ‌యంలో పెద్ద ఎత్తున ర‌హ‌దారుల‌ను కూడా నిర్మించారు. పైగా ఇక్క‌డ క‌మ్మ సామాజిక వ‌ర్గ ఆధిప‌త్యం ఎక్కువ‌. ఇక రాజ‌ధాని రియ‌ల్ భూమ్ హ‌వాలో ఇక్క‌డ సామాన్యులు సైతం కుబేరులు అయ్యారు. దీంతో టీడీపీకి మ‌రింత మ‌ద్ద‌తు చేకూరి జిల్లా జిల్లా మొత్తం.. కంచుకోట‌గా మారుతుంద‌ని లెక్క‌లు వేసుకున్నారు. కానీ, అనూహ్యంగా ఇక్క‌డ వైసీపీ పుంజుకుంది.

దీంతో ఇంకేముంది.. టీడీపీకి ఏమీలేదు.. అంతా మాదే.. అంతా మేమే.. అనే త‌ర‌హాలో వైసీపీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో నిజంగానే వైసీపీ బ‌ల‌ప‌డిందా? ఇది బ‌ల‌మేనా ? అనే చ‌ర్చ సాగుతోంది. అయితే, గ‌డిచిన రెండేళ్ల‌లో ఇక్క‌డ చేసిన అభివృద్ధి అంటూ లేక‌పోగా.. నేతలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు ఎంపీ, ఎమ్మెల్యేలు వీధి పోరాటాల‌కు దిగారు. దీంతో ప్ర‌జాప్రతినిధులు అంటే.. ఉండే విలువ‌ను చేజేతులా నాశ‌నం చేసుకున్న‌ట్ట‌యింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక‌, అత్యంత కీల‌క‌మైన‌.. అమ‌రావ‌తి త‌ర‌లింపు విష‌యంపై ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌రింత ఆగ్ర‌హంతో ఉన్నారు. సో.. ఇవ‌న్నీ ప‌రిశీలిస్తే.. ఓ రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాలు.. మిన‌హా.. ఎక్క‌డా వైసీపీకి సానుభూతి ల‌భించ‌డం లేదు. దీనిని బ‌ట్టి వైసీపీది బ‌లుపో.. వాపో అర్ధ‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.