తెలంగాణ జల వివాదంపై జగన్ కీలక వ్యాఖ్యలు

కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి పంచాయితీలు లేకుండా..సాఫీగా సాగిపోతుందనుకుంటున్న వేళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గళం విప్పటం.. ఏపీ సర్కారు నిర్మిస్తున్న రాయలసీమ ప్రాజెక్టుపై ఘాటు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి ఒక మాట అంటే.. దానికి పది మాటల్ని జేర్చి.. టీఆర్ఎస్ నేతలు కొందరు చెలరేగిపోతున్నారు. ఇదంతా జరుగుతున్న వేళ.. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మౌనంగా ఉన్నారు. ఈ ఇష్యూను షురూ చేసిన కేసీఆర్ తర్వాత కామ్ గా ఉన్నప్పటికీ.. వారి మంత్రులు మాత్రం విరుచుకుపడుతున్నారు.
దీనికి ప్రతిగా ఏపీ మంత్రులు.. వైసీపీ నేతలు పలువురు స్పందించారు. ఇలా మాటా.. మాటా పెరుగుతూ.. వివాదం అంతకంతకూ ముదురుతున్న వేళ.. అనూహ్యంగా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వాడేస్తున్న వైనంపై ఇప్పటికే ఏపీ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే.. ఈ రోజున జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి విషయంలో తెలంగాణ వైఖరిని ఏపీ కేబినెట్ తీవ్రంగా తప్ప పట్టింది. ఈ వ్యవహారాన్ని కేంద్రానికి తీసుకెళ్లానని.. దీనిపై ప్రధాని మోడీకి లేఖ రాయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయంలో కనీస డ్రాయింగ్ లెవల్ కు నీటిమట్టం చేరుకోకముందే.. పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేయటం.. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాలను పట్టించుకోకపోవటం హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఏపీ అభ్యంతరాల్ని వ్యక్తం చేసింది. తాజాగా ఇదే అంశంపై ఏపీ మంత్రివర్గంలో చర్చకు వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని.. వారిని ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతోనే ఎక్కువగా మాట్లాడటం లేదని వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పినట్లుగా సమాచారం.

తాజాగా నెలకొన్న జలవివాదంలో తెలంగాణ మంత్రులు పలువురు తమ పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. దివంగత మహానేత వైఎస్ ను ఉద్దేశించి.. నరరూప రాక్షసుడంటూ నోరు పారేసుకోవటం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతోంది. అనవసరమైన వ్యాఖ్యలు సరికాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.