ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుండి నరేంద్రమోడి ఏపి విషయాల్లో నిర్లక్ష్యంగానే ఉన్నారు. నిర్లక్ష్యం అనేకన్నా చిన్నచూపంటే సరిగ్గా సరిపోతుందేమో. తొందరలో జరుగుతుందని అనుకుంటున్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించి అనేక పేర్లు పరిశీలనలో ఉన్నాయట. ఆ పేర్లలో చాలా రాష్ట్రాల నుండి చాలా పేర్లున్నా ఏపి నుండి ఒక్కపేరు కూడా పరిశీలనలో లేదట.
మొదటేమో ప్రత్యేకహోదాను రాష్ట్రానికి ఎగ్గొట్టారు. తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ హుష్ కాకీ అయిపోయింది. ఆ తర్వాత వెనకబడిన జిల్లాల అభివృద్ధికి ఇస్తున్న నిధులను నిలిపేశారు. ఆ తర్వాత పోలవరం అంచనా వ్యయాలను తనిష్ట ప్రకారం తగ్గించేశారు. ఇవన్నీ పక్కనపెడితే యూనియన్ బ్యాంకును ఆంధ్రబ్యాంకులో విలీనం చేసి యూనియన్ బ్యాంకుగా మార్చేశారు. అంటే ఇవన్నీ చూస్తుంటే మోడికి ఏపి అంటే అస్సలు గిట్టదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తాజాగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే పేర్ల జాబితా అంచనాలో ఏపి నుండి ఒక్కరూ కనబడలేదు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు సుమారు 30 పేర్లు పరిశీలినలో ఉన్నాయట. పరిశీలనలో ఉన్న పేర్లలో ఏపి నుండి తప్ప మిగితా రాష్ట్రాల నుండి చాలా పేర్లే ఉన్నాయి. వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లోని ఎంపిలకు మొదటి ప్రాధాన్యత దక్కబోతోందనేది వాస్తవం.
చాలా రాష్ట్రాల పేర్లు పరిశీలనలో ఉన్నా ఏపి విషయాన్ని మాత్రం ఎందుకు పరిగణలోకి తీసుకోవటంలేదు ? ఎందుకంటే ఏపిలో పార్టీ పరిస్ధితి అంత ఘనంగా ఉందికాబట్టే. ఏపి నుండి బీజేపీకి ఒక్క లోక్ సభ సభ్యుడు కానీ రాజ్యసభ సభ్యుడు కానీ లేరు. రాజ్యసభలో తెలుగు ఎంపిలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ వాళ్ళెవరు ఏపి నుండి నామినేట్ కాలేదు. ఏపి నుండి ముగ్గురు ఎంపిలున్నప్పటికీ వాళ్ళు టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించారు.
ఒకవేళ ఏపికి ఏదో రూపంలో కేంద్రమంత్రివర్గంలో చోటిచ్చినా పెద్దగా ఉపయోగం ఉండదని మోడికి అర్ధమైపోయిందేమో. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీ పరిస్ధితి నేలబారుకు పడిపోయింది. ఎంత అవస్తలు పడుతున్న అంగుళం కూడా పైకి లేవటంలేదు. ఏరకంగాను ఉపయోగం లేని రాష్ట్రంలో ఒక కేంద్రమంత్రి పదవిని ఇవ్వాలని మోడినే కాదు ఎవరు మాత్రం ఎందుకనుకుంటారు ?