క‌ట్టుత‌ప్పిన సీనియ‌ర్ల‌కు గుణ‌పాఠం

నానాటికీ తిరోగ‌మ‌న దిశ‌గా ప‌రుగులు పెడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలిచ్చి.. పురోగ‌మ‌న బాట ప‌ట్టిస్తార‌నే భారీ ఆశ‌తో పార్టీ అధిష్టానం.. యువ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్.. రేవంత్‌రెడ్డికి పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించింద‌ని అంటున్నారు మేధావులు. నిజానికి తెలంగాణ‌లో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిణామాల ప్ర‌స్తుత ద‌శ‌లో అధిష్టానం పార్టీ ప‌గ్గాలు ఇవ్వ‌డం కాదు.. చేప‌ట్ట‌డ‌మే పెద్ద స‌వాల్‌.. అన్న విష‌యం మేధావులు సైతం అంగీక‌రిస్తున్నారు. ఒక‌వైపు అధికార పార్టీ దూకుడు, మ‌రోవైపు బీజేపీ విస్త‌ర‌ణ అస్త్రం.. వెర‌సి.. తెలంగాణ కాంగ్రెస్‌కు కాలం చెల్లుతోంద‌నే వ్యాఖ్య‌లు ఇటీవ‌ల కాలంలో జోరుగా వినిపించాయి.

గ‌త 2018 ఎన్నిక‌ల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు.. టీఆర్ ఎస్‌లో చేరి మంత్రి ప‌ద‌వులు తెచ్చుకొవ‌డం నుంచి వ‌రుస ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజాయాలు కాంగ్రెస్‌ను వెక్కిరిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో జోక్యం చేసుకుని పార్టీని ఎవ‌రికి వారే క్ర‌మ‌శిక్ష‌ణ‌తో న‌డిపిస్తార‌నే అధిష్టానం ఎదురు చూపులు.. ఫ‌లించ‌ని నేప‌థ్యంతోపాటు.. సీనియ‌ర్ల మ‌ధ్య పీసీసీ పీఠం ఒక అధికారిక హోదాగా మారిపోయి.. పెత్త‌నం చెలాయించే ప‌ద‌విగానే చూడ‌డం మొద‌లైన ద‌రిమిలా కాంగ్రెస్‌ మ‌రిన్ని ఇబ్బందుల్లోకి కూరుకుపోయింది. అదేస‌మ‌యంలో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యం పేరిట‌.. సీనియ‌ర్లు.. జుట్టుజుట్టు పీక్కున్న విధంగా ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం.. నేల విడిచి సాము చేసిన చందాన్నే త‌ల‌పించింది.

దీనికితోడు.. పీసీసీ పీఠ‌మే ల‌క్ష్యం త‌ప్ప‌… పార్టీ ఎదుగుద‌ల త‌మ‌కు అక్క‌ర‌లేద‌న్న రీతిలో కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, జ‌గ్గారెడ్డి.. దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు.. ఇలా.. అనేక మంది వ్య‌వ‌హ‌రించిన తీరు.. పార్టీ ప‌రువును రోడ్డున ప‌డేసింది. అదేస‌మ‌యంలో ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై అంత‌ర్గ‌త చ‌ర్చ‌లు, విజ‌యం దిశ‌గా తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స‌మున్న‌త‌స్థాయిలో చ‌ర్చ‌లు జ‌రిపి.. మార్గాలు మ‌లుచుకోవాల్సిన సీనియ‌ర్లు.. అప్ప‌టి పార్టీ పీసీసీ చీఫ్‌.. ఉత్త‌మ్ కుమార్ కేంద్రంగా చేసిన రాజ‌కీయం.. వ‌ల్ల‌.. ప‌రువు పోయి.. పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారింద‌నేది నిర్వివాదాంశం. 2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో రాష్ట్రంలో ప‌ర్య‌టించిన రాహుల్ గాంధీ.. “ఎవ‌రు ఏం చేసినా.. అంతిమ ల‌క్ష్యం పార్టీ ప్ర‌యోజ‌నంగా ఉండాల”న్న సూచ‌న ప‌ట్టించుకున్న నాథుడు క‌నిపించ‌లేదు.

ఫ‌లితంగానే అధిష్టానం.. క‌ర్ర‌కాల్చి వాత‌పెట్టిన విధంగా.. సీనియ‌ర్ల‌కు షాక్ ఇచ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో అధిష్టానం.. అన్ని వైపుల నుంచి.. జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. తాజా నిర్ణ‌యంతో పోయే వారు పోయినా.. ఫ‌ర్వాలేదు! అనే గ‌ట్టి నిర్ణ‌యం దిశ‌గానే అడుగులు వేసిన‌ట్టు స్పష్టంగా తెలుస్తోంది. యువ నాయ‌కుడు, రాజ‌కీయంగా దూకుడు ఉన్న రేవంత్‌.. అన్నింటినీ స‌మ‌ర్థంగా దాటుకునిపార్టీని నిల‌బెడ‌తార‌నే గ‌ట్టి ఆలోచ‌న ఈ నిర్ణ‌యం వెనుక ఉంద‌ని.. ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇలా.. మొత్తంగా చూస్తే.. సీనియ‌ర్లు.. ఇప్ప‌టికైనా.. పార్టీ కోసం ప‌నిచేస్తే త‌ప్ప‌.. ఫ్యూచ‌ర్ లేద‌నే విష‌యాన్ని కాంగ్రెస్ అధిష్టానం చెప్ప‌క‌నే చెప్పింద‌ని అంటున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.