గ‌జ్వేల్‌కు కేసీఆర్ గుడ్ బై… ఈ సారి పోటీకి ఆ ప్లేస్ ఫిక్స్ ?


తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంపీ, ఎమ్మెల్యేగా ప‌లు మార్లు పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆయ‌న సుధీర్ఘ రాజ‌కీయ జీవితంలో 1983 ఎన్నిక‌ల్లో అప్ప‌టి కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌ద‌న్‌మోహ‌న్ చేతిలో మాత్ర‌మే ఆయ‌న ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఏ ఎన్నిక జ‌రిగినా గెలుపు కేసీఆర్‌దే. 2001లో టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స‌మితి స్థాపించి తొలిసారి సిద్ధిపేట ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అప్ప‌టి నుంచి కేసీఆర్‌కు ఓట‌మి లేదు. సిద్ధిపేట ఎమ్మెల్యేగా, క‌రీంన‌గ‌ర్ – మ‌హ‌బూబ్ న‌గ‌ర్ – మెద‌క్ ఎంపీలుగా ఇప్పుడు గ‌జ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నారు. క‌రీంన‌గ‌ర్ ఎంపీగా 2004 సాధార‌ణ ఎన్నిక‌ల‌తో పాటు 2006 ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. 2009 ఎన్నిక‌ల్లో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ఎంపీగా పోటీ చేసి కేవ‌లం 16 వేల ఓట్ల మెజార్టీతో మాత్ర‌మే గెలిచారు. ఇక 2014లో తెలంగాణ ఏర్ప‌డ్డాక ఆయ‌న మెద‌క్ ఎంపీగాను, గ‌జ్వేల్ ఎమ్మెల్యేగాను పోటీ చేసి రెండు చోట్లా విజ‌యం సాధించారు.

ఆ త‌ర్వాత మెద‌క్ ఎంపీ సీటును ఆయ‌న వ‌దులుకున్నారు. ఇలా ఉత్త‌ర తెలంగాణ మొద‌లుకుని ద‌క్షిణ తెలంగాణ వ‌ర‌కు మెద‌క్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అన్ని జిల్లాలనో ఓ రౌండ్ వేస్తూ వ‌స్తోన్న కేసీఆర్ ఉద్య‌మాల ఖిల్లా అయిన న‌ల్ల‌గొండ‌లో మాత్రం పోటీ చేయ‌లేదు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆ కోరిక కూడా తీరిపోనుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. 2023 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ న‌ల్లగొండ జిల్లాలోని ఆలేరు నుంచి పోటీ చేసేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. గ‌జ్వేల్ నుంచి ఆయ‌న వ‌రుస‌గా రెండు సార్లు గెలిచారు. అయితే అక్క‌డ కేసీఆర్ గెలిచినా ప్రాజెక్టుల‌ భూసేక‌ర‌ణ ప‌రిహారాలు, పున‌రావాసాల విష‌యంలో సాధార‌ణ జనాల్లో తీవ్ర‌మైన అసంతృప్తి నెలకొంది.

ఈ క్ర‌మంలోనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి నియోజ‌క‌వ‌ర్గం మారి పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. కేసీఆర్ యాదాద్రి ఆల‌యాన్ని కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా ఆయ‌న ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకోవ‌డంతో పాటు ఆ గ్రామంలో ప‌ర్య‌టించి గ్రామ‌స్తుల‌తో స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. ఆలేరు టీఆర్ఎస్‌కు కంచుకోట‌. కేసీఆర్ చేస్తోన్న ఈ ప‌నుల‌న్ని ముంద‌స్తు ప్లానింగ్‌లో భాగ‌మే అంటున్నారు. ఆలేరులో టీఆర్ఎస్ నాలుగు సార్లు గెలిచింది. ప్ర‌స్తుతం అక్క‌డ టీఆర్ఎస్ నుంచి మహిళా ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఆమె విప్‌గా కూడా ఉన్నారు.