ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెదొక దారన్న సామెత ఏపీ రాజకీయాలకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. రాష్ట్రం కాదు.. దేశం కాదు.. యావత్ ప్రపంచమంతా ఇప్పుడు మాయదారి రోగం గురించి ఆలోచిస్తూ.. దాని దెబ్బకు ఆగమాగమైపోతున్న వేళ.. ఏపీలో మాత్రం అందుకు సిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికార.. విపక్ష నేతల మధ్య ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. విమర్శలు.. ప్రతివిమర్శలు ఇలా చెప్పుకుంటూ పోతే.. ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ప్రజల గురించి పట్టకుండా తమ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే అధికార.. విపక్షాల తీరు కనిపిస్తుంటుంది.
మాయదారి రోగం రాష్ట్రంలో అంతకంతకూ విస్తరిస్తున్న వేళలోనే.. ఎల్ జీ పాలీమర్స్ దుర్ఘటన చోటు చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగంలో దొర్లే తప్పలను మరింత హైలెట్ చేయటం.. తాము అధికారంలో ఉన్నప్పుడు నాటి విపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏ రీతిలో అయితే సోషల్ మీడియాలో విరుచుకుపడేవారో.. ఇప్పుడు అదే రీతిలో దూకుడును ప్రదర్శిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు ఏ చిన్న తప్పు దొర్లినా.. అందుకు మూల్యం భారీగా చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఉదంతమే గుంటూరుకు చెందిన రంగనాయకమ్మ విషయంలో జరిగిందని చెప్పాలి. ఎల్ జీ పాలిమర్స్ కు సంబంధించిన సోషల్ మీడియాలో ఒక పోస్టు ఆమె చూశారు.
దాని సారాంశం.. మళ్లీ లీకవుతున్న గ్యాస్.. సీఎం.. 150 + 2.. 22 ఎలా నిద్రపడుతోందయ్యా.. ఎక్స్ పర్ట్స్ ను పెట్టుకొని పని చేయించయ్యా అంటూ ఒక పోస్టు పెట్టారు. దీనికి సంబంధించి ఒక ఫోటోను పెట్టారు. అయితే.. ఈ పోస్టులో ఉన్న దాన్లో ‘మళ్లీ లీక్ అవుతున్న గ్యాస్’ అన్న క్యాప్షన్.. ప్రజల్లో భయాందోళనల్ని రేకెత్తించటం.. శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యతో పాటు.. ఇతర అంశాలు ఉంటాయి.
ఇలాంటి ప్రచారాల మీద జగన్ ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో.. చట్టం తన పని తాను చేసుకోవటం మొదలైంది. దీని ఫలితం 66 ఏళ్ల రంగనాయకమ్మ అనే మహిళపై సీఐడీ కేసు నమోదు చేసింది. దీనికి సంబంధించి ఆమె నోటీసు అందుకున్నారు.
ఇంతకీ ఈ రంగనాయకమ్మ ఎవరన్న విషయంలోకి వెళితే.. టీడీపీ సానుభూతిపరురాలు..టీడీపీకి సంబంధించి కాస్త యాక్టివ్ గా ఉండే వ్యక్తి. ఒక చిన్న పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న విషయం మీద అవగాహన పెద్దగా లేకపోవటంతో ఆమె ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
66 ఏళ్ల పెద్దావిడ మీద కేసు ఎలా నమోదు చేస్తారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనికి జగన్ పార్టీ సానుభూతిపరుల వాదన మరోలా ఉంది. ఒక టీడీపీ సానుభూతిపరురాలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తప్పుడు ప్రచారం చేయటాన్ని ఎలా సహించాలి? అన్నది వారి వాదన.
తప్పొప్పుల విషయానికి వస్తే.. ఎవరికి వారే అన్నట్లుగా ఏపీ అధికార.. విపక్ష నేతల మధ్య అంతులేని వాదనలు చోటు చేసుకోవటం మామూలు. కాకుంటే ఒక్కటి.. కావాలనే ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు వీలుగా పోస్టు పెట్టారా? దాని వెనుక ఏమైనా కుట్ర దాగి ఉందా? అన్న విషయం మీద మరింత కసరత్తు చేసిన తర్వాత రంగనాయకమ్మ మీద చర్యలు తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.
అంతేకాదు.. వయసును పరిగణలోకి తీసుకొని.. ఇలాంటి తప్పుడు పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తప్పవన్న హెచ్చరికను జారీ చేసి ఉంటే మరింత బాగుండేదన్న అభిప్రాయం ఉంది. అయితే.. ఇలాంటివాటిని జగన్ పార్టీ నేతలు.. అభిమానులు తప్పు పడుతున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం పోస్టులు పెట్టే వారి విషయంలో.. వయసులో పెద్దా చిన్నా తేడా లేకుండా చర్యలు తీసుకోవాలనే స్పష్టం చేస్తున్నారు. ఢీ అంటే ఢీ అనేందుకు సిద్ధంగా ఉన్న రెండు పక్షాలు అధికార.. విపక్షాలుగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి మరి.