ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు సుప్రీం ఊర‌ట‌.. తాజా ఆదేశాలు ఇవే!

క్యాస్ట్ స‌ర్టిఫికెట్ విష‌యంలో ఇటీవ‌ల కాలంలో తీవ్ర వివాద‌మైన ఎంపీ న‌వ‌నీత్ కౌర్‌కు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. ‘శీను-వాసంతి-ల‌క్ష్మి’ మూవీతో ఫేమ‌స్ అయిన‌.. న‌వ‌నీత్‌కౌర్ మ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. పార్ల‌మెంటులో గ‌ట్టి వాయిస్ కూడా వినిపించే నాయ‌కురాలిగా ఆమె పేరు తెచ్చుకున్నారు. “మోడీ.. త‌న మ‌న‌సులో మాటలు చెబుతున్నారు. కానీ, రైతుల మ‌న‌సులో మాట‌లు కూడా వినిపించుకోండి. ఈ ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారో వినండి” అంటూ కొన్నాళ్ల కింద‌ట పార్ల‌మెంటులో కౌర్ చేసిన ప్ర‌సంగానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

2014 సార్వత్రిక ఎన్నికల ముందు రాజకీయాల్లోకి వచ్చిన నవనీత్ కౌర్.. అప్పట్లో ఎన్సీపీ టిక్కెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా గెలిచారు. అయితే.. అమ‌రావ‌తి ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కౌర్‌పై పోటీ చేసి ఓడిపోయిన శివసేన నేత, మాజీ ఎంపీ ఆనందరావు అదసూల్.. కౌర్ ఎస్సీ కేటగిరికి చెందిన మహిళ కాదని, త‌ప్పుడు కులధ్రువీకరణ పత్రాన్ని ఎన్నిక‌ల సంఘానికి స‌మ‌ర్పించార‌ని ఆరోపించారు. ఇదే విష‌యంపై ఆయ‌న బాంబే హైకోర్టులో పిటిష‌న్ కూడా దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ జ‌రిపిన బాంబే హైకోర్టు.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

కౌర్ క్యాస్ట్ స‌ర్టిఫికెట్‌ను ర‌ద్దు చేయ‌డంతోపాటు.. రూ.2 లక్షల జరిమానా విధించింది. బాంబే హైకోర్టు తీర్పు.. దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఇక‌, దీనిపై సుప్రీంకు వెళ్లిన కౌర్‌కు తాజాగా ఉప‌శ‌మ‌నం ల‌భించింది. సుప్రీం కోర్టులో జ‌రిగిన విచార‌ణ‌లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును న్యాయ‌మూర్తులు నిలుపుద‌ల చేశారు. అయితే.. పూర్తిస్థాయి విచార‌ణ మాత్రం జ‌ర‌గ‌నుంద‌ని కోర్టు తెలిపింది. ఈ సంద‌ర్భంగా అమ‌రావ‌తిలో కౌర్ అభిమానులు సంబ‌రాలు చేసుకున్నారు. ఇక‌, న్యాయం గెలిచింద‌ని.. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు ప‌టాపంచ‌లు అయిపోయాయ‌ని కౌర్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.