“జగన్ విజన్ సూపర్”- ఈ మాట అన్నది ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవే. తాజాగా ఆయన తన ట్విట్టర్లో జనగ్ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. రాసింది రెండు మూడు లైన్లే అయినా.. భారీ ఎత్తున జగన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. నిజానికి ఆది నుంచి కూడా జగన్‌పై చిరంజీవి ఆసక్తి చూపిస్తున్నారు. గతంలోనూ ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత కోసం.. జగన్ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటోందని చిరు పేర్కొని సంచలనంగా మారారు.
అదేసమయంలో తొలి దశ కరోనా వచ్చినప్పుడు ఏపీలో సినిమా ధియేటర్లను తెరిచే విషయంలోను, సినిమా హాళ్లకు కరెంటు బిల్లులు తొలగించే విషయంలోనూ చిరంజీవే నేరుగా సీఎం జగన్‌ను కలిసి విన్నవించి విజయం సాధించారు. ఈ క్రమంలో.. చిరంజీవి.. ఏపీ ప్రభుత్వంపై సానుకూలంగానే ఉన్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపించాయి. ఇక, ఇప్పుడు .. ఏపీలో గత ఆదివారం జరిగిన మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రస్తావిస్తూ.. చిరంజీవి పొగడ్తల వర్షం కురిపించారు.
“జగన్ విజన్ సూపర్. ఒకేరోజు 13 లక్షలపైచిలుకు ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి.. తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. నా అభినందనలు. ప్రజలకు మరిన్ని మంచిపనులు చేయాలని కోరుతున్నా” అంటూ.. చిరు ట్వీట్ చేశారు. మరి అన్నయ్య ఇలా జగన్‌ను పొగడ్తలతో ముంచెత్తారు సరే. మరి జనసేనాని, చిరు సోదరుడు.. పవన్ కళ్యాణ్ జగన్ సర్కారుపై ఏమంటారు? ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో టీడీపీ విమర్శలు గుప్పించింది.
ప్రజలకు ఏ రోజు కు ఆరోజు వేయాల్సిన వ్యాక్సిన్‌ను నిలిపివేసి.. ఒకే రోజు ఐదు రోజులకు సరిపడా వ్యాక్సిన్ ఇచ్చి.. దీనినే రికార్డ్ అని చూపించుకునేందుకు సిగ్గు పడాలి! అని టీడీపీ నేతలు ఫైరయ్యారు. ఈ క్రమంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ఆసక్తిగా మారింది. మరి పవన్ ఏమంటారో చూడాలి. అయితే.. ఇటీవల కాలంలో పవన్.. జగన్ సర్కారుపై విమర్శలు చేయకపోవడం గమనార్హం. అప్పుడెప్పుడో తిరుపతి ఎన్నికల సమయంలో ఒక్కసారి మాట్లాడిన పవన్.. తర్వాత.. ఎక్కడా అడ్రస్ లేకుండా పోవడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates