కాంగ్రెస్‌కు ఫ్యూచ‌ర్ ఉన్న‌ట్టా? లేన‌ట్టా? మేధావుల మాటేంటంటే!

వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని ఒక సందిగ్ఢ ప‌రిస్థితి ఎదురైంది. పార్టీ పుంజుకుంటుందా? లేక ఇంతేనా? లేక మ‌రిన్ని ఇబ్బందులు వ‌స్తాయా? ఇదీ.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్ ప‌రిస్థితిని గ‌మ‌నిస్తున్న వారిని తొలిచేస్తున్న ప్ర‌శ్న‌లు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ లో నాయ‌క‌త్వ‌లోపం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్పుడున్న కాంగ్రెస్‌ను ప‌రిశీలిస్తే.. ఇది.. ఇందిరా కాంగ్రెస్సేనా? అనే విస్మ‌య‌మూ వ్య‌క్త‌మ‌వుతోంది. పార్టీ అధ్య‌క్షురాలు.. సోనియా గాంధీ నేత‌ల‌ను న‌డిపించ‌లేక పోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న అధ్యక్షురాలు సోనియాకు పార్టీని లైన్‌లో పెట్ట‌డం చాలా ఇబ్బందిగా ఉంద‌నేది వాస్త‌వం. దీంతో ప్రత్యామ్నాయ నాయకత్వం లేకపోవడం అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. పార్టీ ప్రయోజనాలు పట్టకుండా ప్రతిదానినీ వివాదం చేయ‌డం ఇటీవ‌ల కాలంలో నేత‌ల‌కు అల‌వాటుగా మారింది. అదేస‌మ‌యంలో అధిష్టానాన్ని పొగ‌డడంతోనే నేత‌లు స‌రిపెట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా అంతర్గత కుమ్ములాటలతో అంటకాగడం పార్టీకి వారసత్వంగా వ‌స్తోంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ప్రత్యర్థులు సహా ప్రాంతీయ పార్టీల్లో రెండోతరం నాయకత్వం బాధ్యతలు చేపడుతున్నప్పటికీ కాంగ్రెస్‌లో అలాంటి కదలికలు మచ్చుకైనా కనిపించడం లేదు. అధికారం ఇప్పట్లో అందుతుందనే ఆశలు సన్నగిల్లుతుండటంతో నేత‌ల పక్కచూపులు పెరుగుతున్నాయి. ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్లో జ‌రిగింది దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. పార్టీ బలోపేతానికి కట్టుబడే వారు మ‌చ్చుకైనా క‌నిపించ‌డం లేదు. ప్రత్యర్థులపై దాడికి ఆయుధాలు ఎన్నో ఉన్నా పోరాడేవారు లేక‌పోవ‌డం మ‌రో దుర‌వ‌స్థ‌గా క‌నిపిస్తోంది. కరోనా విలయం, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం, చైనా ఆక్ర‌మ‌ణ‌లు, నిరుద్యోగం, పీఎం కేర్స్‌, సోషల్‌ మీడియా వివాదాలు, రైతుల ఉద్యమం ఇలా ఎన్నో సమస్యలపై అధికార పార్టీని బలంగా నిలదీయడానికి ఎవరూ నడుం బిగించడం లేదు.

ప్రజల్లోకి దూసుకెళ్లే నిర్మాణాత్మక క్షేత్రస్థాయి కార్యక్రమాలను నేత‌లు చేపట్టడం లేదనే విమ‌ర్శ చాన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. పతనావస్థపై సహనం నశించి ప్రశ్నించిన సీనియర్లను ఉపేక్షించే ఔదార్యాన్ని పార్టీ ప్రదర్శించడం లేక‌పోవ‌డం మ‌రో విప‌త్తు!. వీర విధేయులకే సభా నాయకత్వ వీరతాళ్లు వేసే సంస్కృతిని కొనసాగిస్తోంది. వరసగా ఎదురవుతున్న పరాజయాలను పరిశీలిస్తే కాంగ్రెస్‌ను ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆత్మపరిశీలనకు ఆస్కారం కనిపించడం లేదు. వర్కింగ్‌ కమిటీ కార్యాచరణ ఏమిటో ఎవరికీ అర్థంకావ‌డం లేదు. ఇటీవల ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో గెలిచే అవకాశం ఉన్నా చేతులారా చేజార్చుకోవడం మ‌రింత దారుణ‌మ‌ని సీనియ‌ర్లు నెత్తీనోరూ మొత్తుకుంటున్నారు. అధికారంలో ఉన్నా పుదుచ్చేరిని కాపాడుకోలేకపోయారు.

ఇక వచ్చే ఏడాది జరగబోయే ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలను కాంగ్రెస్‌ ఎదుర్కొంటుందోన‌ని పార్టీ సానుభూతి ప‌రులు అనుకుంటున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితి మార‌క‌పోతే.. పార్టీలో చేత‌నం పెర‌గ‌క‌పోతే.. 2024లో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ ప్రత్యర్థుల ప్రమేయం లేకుండానే సంక్రమిస్తుంది. అనుభవసారాన్ని, యువశక్తిని జోడించి ముందుకు సాగితేనే పార్టీ పుంజుకుంటుంద‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికైనా.. కాంగ్రెస్ నేత‌లు గుర్తించాల‌ని మేధావులు సూచిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారు? ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారు? అనేది చూడాల్సి ఉంది.