ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్నది చూసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడి పప్పులుడకలేదని అర్ధమైపోతోంది. పేరుకు ప్రధానమంత్రే కానీ ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రం మోడి ఏమనుకున్నా జరగదు. ఉత్తరప్రదేశ్ వరకు ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా సర్వం సహా అధిపతి యోగి ఆదిత్యనాద్ మాత్రమే. ఎందుకంటే యోగి వెనకాల కొండంత అండ ఆర్ఎస్ఎస్ నిలబడుంది. యోగికి అండగా ఉన్న ఆర్ఎస్ఎస్సే మోడికి కూడా మూలం.
అందుకనే యూపీలో ఏమిచేయాలన్నా, యోగి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా అందుకుముందు మోడికి ఆర్ఎస్ఎస్ అనుమతి ఉండాల్సిందే. ఉత్తరప్రదేశ్ లో యోగి పాలనలో బీజేపీ ఇమేజి దారుణంగా పడిపోయింది. పతనమైపోయిన పార్టీ ఇమేజి ప్రభావం మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ దారుణంగా దెబ్బ తినేసింది. చివరకు మోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో కూడా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది.
యూపిలో పరిస్దితులను వెంటనే చక్కదిద్దకపోతే వచ్చే షెడ్యూల్ ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో దెబ్బతినటం ఖాయమని మోడికి అర్ధమైపోయింది. లోక్ సభ ఎన్నికల్లో యూపిలో బీజేపీపై దెబ్బపడితే అంతే సంగతులు. అందుకనే యోగి ప్లేసును మరోకళ్ళతో రీప్లేసు చేయాలని మోడి అనుకున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే సీఎంగా యోగినే కంటిన్యు చేసి స్టీరింగ్ మాత్రం తన మద్దతుదారుల చేతిలోకి తీసుకోవాలని మోడి గట్టి ప్లానే వేశారు.
అందుకనే తనకు ఎంతో నమ్మకస్తుడైన మద్దతుదారుడు ఏకే శర్మను మోడి రంగంలోకి దింపారు. ఆయనను ఉపముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టి యూపీ స్టీరింగ్ ను మోడి తన చేతిలోకి తీసుకోవాలని వ్యూహం రచించారు. అయితే మోడి వ్యూహం యోగి చేతిలో దారుణంగా దెబ్బతినేసింది. ఎలాగంటే శర్మను ఉపముఖ్యమంత్రిగా కాకుండా పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించారు. ఉపాధ్యక్షునిగా శర్మ చేసే పనికూడా ఏమీలేదు. ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యక్షులు 16 మందున్నారు.
రాష్ట్రధ్యక్షుడిగా ఎవరున్నా చేయగలిగేదేమీ లేదు. ఎందుకంటే పార్టీ ఇమేజి అయినా డ్యామేజయినా ముఖ్యమంత్రి పాలన మీదే ఆధారపడుంటుంది. యోగి పాలనలో పార్టీ దెబ్బ తినేసిన తర్వాత అధ్యక్షుడైనా, ఉపాధ్యక్షుడు శర్మ అయినా చేయగలిగేదేమీ ఉండదు. ఇక్కడే మోగి వ్యూహాన్ని యోగి తన ప్రతివ్యూహంతో ఎలా దెబ్బకొట్టాడో అర్ధమైపోతోంది. అంటే యూపి వరకు మోడి పప్పులుడకలేదని స్పష్టమైపోయింది.