‘విడవమంటే పాముకు కోపం..కరవమంటే కప్పకు కోపం’ అన్న సామెతలాగ తయారైపోయింది నరేంద్రమోడి పరిస్ధితి. బీహార్ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో ముసలం పుట్టి పార్టీ చీలిక ఇప్పుడు మోడి మెడకు చుట్టుకుంది. తాజా రాజకీయ పరిణామాల్లో ఎల్జేపీ నిట్టనిలువుగా చీలిపోయిన విషయం తెలిసిందే. ఎంపి, అధ్యక్షుడు, దివంగత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కొడుకైనా చిరాగ్ పాశ్వాన్ ను దింపేసి సొంత చిన్నాన్న పశుపతి కుమార్ పరాస్ అధ్యక్షుడయ్యారు.
పార్టీని నిలువుగా చీల్చేయటమే కాకుండా 6 మంది ఎంపిల్లో ఐదుమందిని పశుపతి తన దగ్గరకు లాగేసుకున్నారు. తమదే అసలైన ఎల్జేపీ అంటు లోక్ సభ స్పీకర్ కు లేఖ కూడా రాశారు. అలాగే తాజాగా పార్టీకి జాతీయ అధ్యక్షునిగా పశుపతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చూస్తుంటే చిరాగ్ ఒంటరైపోయ్యారని అర్ధమైపోతోంది. తండ్రి చనిపోయిన వెంటనే పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్ ఒంటెత్తుపోకడలు పోయిన ఫలితంగా చివరకు తానే రోడ్డుమీద పడిపోయారు.
సరే బాబాయ్-అబ్బాయ్ బాగానే ఉన్నారు కానీ మధ్యలో మోడికి ఇబ్బందులు మొదలయ్యాయి. ఎలాగంటే ఒక వైపేమో పశుపతి నేతృత్వంలోని ఐదుగురు ఎంపిలు. ఇదే సమయంలో మరోవైపు తన చిరకాల మిత్రుడు పాశ్వాన్ కొడుకు చిరాగ్. న్యాయప్రకారమైతే మోడి ఐదుగురు ఎంపిల బలమున్న పశుపతికే మద్దతుగా నిలబడాలి. ధర్మాన్ని ఆచరించాలంటే చిరాగ్ కు అండగా నిలవాలి.
అయితే ప్రస్తుత రాజకీయాల్లో న్యాయం, ధర్మానికి పెద్దగా చోటు లేదన్న విషయం తెలుస్తునే ఉంది. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్నదంతా అవసరాలు, అవకాశాలు మాత్రమే. దీని ప్రకారమైతే ఐదుగురు ఎంపిలున్న పశుపతి వైపే మోడి మొగ్గుంటుందని తెలుస్తోంది. ఎందుకంటే మోడి గనుక చిరాగ్ వైపు మొగ్గుచూపితే లోక్ సభలో ఐదుగురు ఎంపిల బలం పోగొట్టుకున్నట్లవుతుంది.
అసలే దేశంలో బీజేపీ పరిస్దితి అంతంతమాత్రంగా ఉంది. మొన్ననే పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ చేతిలో చావుదెబ్బ తిన్నది. వచ్చేఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోతున్నాయి. అన్నీ రాష్ట్రాల్లోను బీజేపీ పరిస్ధితి అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి నేపధ్యంలో ఐదుగురు ఎంపిల బలాన్ని పోగొట్టుకోవటానికి మోడి ఎంతమాత్రం సిద్ధంగా ఉందరని అర్ధమవుతోంది. మొత్తానికి బాబాయ్ తో పెట్టుకుని అబ్బాయ్ రోడ్డుమీద పడ్డారు.