పూసపాటి కుటుంబంలో ఇంకా మగవారసులున్నారా ?

పూసపాటి రాజకుటుంబం అంటే జనాల్లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ మాన్సాస్ ట్రస్టని, గజపతుల కుటుంబమని చెప్పగానే చాలామందికి విషయం అర్ధమైపోతుంది. అవును ఇపుడు తాజాగా మొదలైన వివాదమంతా మాన్సాస్ ట్రస్టు వారసత్వం మీదే కదా. గజపతుల చివరి రాజు పీవీజీ రాజు 1958లో ప్రారంభించిన మాన్సాస్ ట్రస్టు ఇపుడు రాజకీయంగా అనే వివాదాల్లో నానుతోంది. వైసీపీ ప్రభుత్వం రాగానే అశోక్ గజపతిరాజు స్ధానంలో సంచియిత గజపతిరాజును ఛైర్ పర్సన్ చేయటంతోనే తేనెతుట్టెను కదిల్చినట్లయ్యింది.

ట్రస్టు బైలా ప్రకారం మగవాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే ఛైర్మన్ గా ఉండాలని అప్పట్లో పీవీజీ రాజు ఓ రూలు పెట్టారు. అలాఎందుకు పెట్టారన్నది ఇపుడు అప్రస్తుతం. అయితే రూలు రూలే కాబట్టి తన స్ధానంలో సంచయిత ఛైర్ పర్సన్ కావటానికి వీల్లేదని అశోక్ కోర్టులో కేసు వేసి గెలిచారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది. అదేమిటంటే పీవీజీరాజు పెద్ద కొడుకు ఆనందగజపతిరాజుకు కొడుకులు లేరు. విడాకులు తీసుకున్న ఉమా గజపతిరాజు కూతురే సంచయిత. రెండో భార్య సుధకు కూడా కూతురే..ఊర్మిళ.

కోర్టు ద్వారా మళ్ళీ ఛైర్మన్ పగ్గాలు పట్టబోతున్న అశొక్ కూడా కొడుకులు లేరు. కూతురు అదితి మాత్రమే వారసురాలు. వీలునామా ప్రకారం మగవాళ్ళు, పెద్దవాళ్ళు మాత్రమే ఛైర్మన్ కావాలంటే మరి భవిష్యత్తులో పరిస్ధితి ఏమిటి ? ఇద్దరు కొడుకుల్లో ఎవరికీ కొడుకులు లేరు కాబట్టి అశోక్ తర్వాత ట్రస్టు పగ్గాలు ఎవరికి వెళతాయి ? ఇపుడిదే ప్రశ్న జనాల్లో బాగా నలుగుతోంది. దాంతో పీవీజీ రాజు వివాహం గురించి జనాల్లో చర్చలు మొదలయ్యాయి.

అదేమిటంటే పీవీజీ రాజుకు కూడా ఇద్దరు భార్యలట. ఇపుడు చెప్పుకుంటున్న ఆనంద్, అశోక్ రెండో భార్య సంతానమట. మొదటిభార్యకు ఇద్దరు కొడుకులున్న విషయం ఇపుడు చర్చల ద్వారా బయటకొచ్చింది. మొదటిభార్యకు అలోక్ గజపతిరాజు, మోనిష్ గజపతిరాజని ఇద్దరు కొడుకులున్నారట. వీరిలో మోనిష్ వివాహం చేసుకోలేదు. అలోక్ కు ఓ కొడుకున్నట్లు సమాచారం. ఇతనిపేరు విహాన్ గజపతిరాజట. అయితే అలోక్, మోనిష్ తల్లి కూడా పీవీజీ రాజుతో విడాకులు తీసుకున్నారు. కాబట్టి టెక్నికల్ గా వీళ్ళకు ఇపుడు పూసపాటి వంశంపై హక్కులు లేవు.

అంటే సంచయిత విషయమే అలోక్, మోనిష్ కూడా వర్తిస్తుందన్నమాట. మరి ట్రస్టు రూల్ ప్రకారం మగవాళ్ళు, పెద్దకొడుకే ట్రస్టు పగ్గాలు చేపట్టాలంటే అశోక్ తర్వాత అలోక్ మోనిష్ కానీ లేదా అలోక్ కొడుకు విహాన్ రాజు కానీ పిక్చర్లోకి రావచ్చేమో. ఎందుకంటే ట్రస్టు పగ్గాల కోసం సంచయిత ఎలాంటి వాదన వినిపించిందో అదే వాదన అలోక్, మోనిష్, విహాన్ రాజుకు కూడా వర్తిస్తుంది. అంటే ఇదంతా అశోక్ తర్వాత విషయమే లేండి. మొత్తానికి మాన్సాస్ ట్రస్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భవిష్యత్తులో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో.