తెలంగాణలో రాజకీయ బడబాగ్ని రగులుతోంది. సీఎం కేసీఆర్ టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే కాదు.. సొంత పార్టీలో కీలక నేతలు కూడా తెరచాటు రాజకీయాలు చాలానే చేస్తున్నారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు ఈటల ఒక్కరు మాత్రమే కాదు.. పైకి చెప్పుకోకపోయినా లోపల చాలా మంది నేతలు కేసీఆర్ తమపట్ల వ్యవహరిస్తోన్న తీరుపై కక్కలేక.. మింగలేక చందంగా ఉన్నారన్నది నిజం. కేసీఆర్ రాజకీయాల్లోకి వచ్చి మూడున్నర దశాబ్దాలు అవుతోంది. ఈ మూడున్నర దశాబ్దాలుగా ఆయనకు మిత్రులుగా ఉన్నవారు, ఇక తెలంగాణ ఉద్యమం ఆవిర్భావంతో పాటు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆయన వెంట ఉన్న వారు ఇప్పుడు క్రమక్రమంగా తెరమరుగు అయిపోతున్నారు.
వీరిని కేసీఆర్ ఇక అవసరం లేదనుకుని సైడ్ చేసేస్తున్నారా ? లేదా ? మర్చిపోతున్నారో ? కాని ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే మరికొందరు నేతలు కూడా ఈటల బాటలోనే వెళ్లే ఛాన్సులు ఉన్నాయన్న చర్చలు అధికార టీఆర్ఎస్ వర్గాల్లోనే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్‌కు టీడీపీలో ఉన్నప్పటి నుంచే అత్యంత సన్నిహితుడు అయిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరో మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూధనా చారి ఈ ముగ్గురు కేసీఆర్ తొలి ప్రభుత్వంలో హీరోలుగా ఉండి.. ఇప్పుడు ఎవ్వరికి పట్టని జీరోలు అయిపోయారు. చివరకు వీరు ముగ్గురు అస్తిత్వం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మాజీ స్పీకర్ మధుసూధనా చారి 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన మంత్రి పదవి ఆశించినా… కేసీఆర్ ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవిని అప్పగించారు. కానీ 2018 ఎన్నికల్లో మధుసూధనాచారి ఓటమి పాలయ్యారు. ఆయనపై గెలిచిన గండ్ర వెంకట రమణారెడ్డి టీఆర్ఎస్‌లోకి రావడంతో అక్కడ మధుసూధనా చారిని పట్టించుకునే వాళ్లే లేరు. ఇక ఎన్నికలకు ముందు సీటు వదులుకుంటే ఆయనకు కేసీఆర్ రాజ్యసభ ఆఫర్ చేశారు. అసలు ఇప్పుడు ఆయనకు అపాయింట్‌మెంట్ ఇవ్వని పరిస్థితి.
ఇక ఖమ్మం జిల్లా రాజకీయాలను ఎప్పుడూ తన గుప్పిట్లో పెట్టుకునే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత ఎన్నికల్లో పాలేరులో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తారన్న ప్రచారం జరిగినా ఆయన్ను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ కు కేటీఆర్ సపోర్ట్ ఉండడంతోనే తుమ్మలకు కేసీఆర్ ప్రయార్టీ ఇవ్వడం లేదన్న టాక్ ఉంది. దీంతో తుమ్మల ఇప్పుడు రాజకీయంగా నిర్వేదంలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్నారు.
ఇక మరో మాజీ మంత్రి కడియం శ్రీహరిది అదే పరిస్థితి. వరంగల్ ఎంపీగా ఉన్న ఆయన్ను ఆ పదవికి రాజీనామా చేయించి… ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ఆ తర్వాత ఎంపీ టిక్కెట్ లేదు.. ఇటు మంత్రి పదవి లేదు… కనీసం ఎమ్మెల్యే సీటు కూడా లేదు. ఇక ఇప్పుడు అపాయింట్‌మెంటే లేదంటున్నారు. దీంతో కడియం చివరకు కేసీఆర్ దృష్టిలో పడేందుకు ఆపసోపాలు పడుతున్నారు. మరి ఈ ముగ్గురు నేతలను కేసీఆర్ ఓ చూపు చూస్తే భవిష్యత్తు ఉంటుంది.. లేకపోతే అంతే సంగతేమో ?