జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడి హోదాలో గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేశారు. పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన పవన్ రాజకీయంగా అప్పుడప్పుడు మాత్రమే బయటకు వస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం బీజేపీతో జట్టుకట్టిన పవన్ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడంతో పాటు రాజకీయంగా ఏమంత యాక్టివ్‌గా లేరు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ల టైం ఉంది. అధికార వైసీపీ అయితే మరో యేడాదిలోనే ఎన్నికలు ఉంటే ఎలా సిద్ధమవుతారో ? అదే ప్రిపరేషన్లో ఎన్నికలకు వెళుతున్నట్టు వాతావరణం ఉంది. జగన్ పాలన, సంక్షేమ పథకాల అమలు చూస్తుంటే 2024 టార్గెట్‌గానే ముందుకు వెళుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది.
ఇక పవన్ 2014లోనే జనసేన పార్టీ పెట్టినా ఈ ఏడేళ్లలో కనీసం ఎమ్మెల్యే కూడా కాలేదు. ఆ ఎన్నికల్లో అసలు పోటీయే చేయలేదు. బీజేపీ, టీడీపీకి సపోర్ట్ చేశాడు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో విబేధించి ఒంటరిగా పోటీ చేసి ఘోర పరాజయం మూటకట్టుకున్నారు. సినిమా స్టార్‌గా ఇంత క్రేజ్ ఉండి… ఏడేళ్ల నాడే పార్టీ పెట్టినా పవన్ కనీసం ఎమ్మెల్యే కాలేదు. ఇక ఇప్పుడు పవన్ బీజేపీతో స్నేహం చేస్తున్నా…. వచ్చే ఎన్నికల వరకు ఇదే స్నేహం కంటిన్యూ అవుతుందా ? లేదా మళ్లీ టీడీపీతో జట్టు కడతారా ? అన్న సందేహాలు, చర్చలు కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో జనసేన గెలవడం అటుంచితే.. కనీసం తాను అయినా ఎమ్మెల్యేగా గెలవాలని పవన్ గట్టిగానే డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవని పవన్.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీ బరిలో ఉండాలి. ఈ సారి గెలవకపోతే పవన్ ఇమేజ్ మరింత పాతాళానికి పడిపోవడం ఖాయం. ఈ క్రమంలోనే ఈ సారి పవన్ ఒక్క నియోజకవర్గంలోనే పోటీ చేయాలని… అది కూడా ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గమే అయ్యి ఉండాలని పవన్ డిసైడ్ అయ్యాడట. గత ఎన్నికల్లో సొంత జిల్లాలోని భీమవరంతో పాటు విశాఖలోని గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు.
భీమవరంలో రెండో స్థానంలో ఉంటే.. గాజువాకలో ఘోరంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. పవన్ ఈసారి బలమైన నియోజకవర్గంకోసం వేట మొదలు పెట్టారట. పవన్ గత ఎన్నికల్లోనే సీమలోని అనంతపురం లేదా కదిరి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఈ సారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చలు జనసేన ఉన్నత స్థాయి వర్గాల్లో నడుస్తున్నాయి. గతంలో పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ నుంచి రెండు చోట్ల పోటీ చేస్తే పాలకొల్లులో ఓడి… తిరుపతిలో గెలిచారు. అక్కడ బలిజ వర్గం ఓటర్లు ఎక్కువ. అందుకే ఈ సారి పవన్ తిరుపతి నుంచి బరిలో ఉండే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని జనసేన నేతలే చెపుతున్నారు. మరి పవన్ రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates