ఏపీ సీఎం జగన్‌కు హైకోర్టులో మరో గట్టి దెబ్బతగిలింది. విజయనగరం గజపతి వంశీయులకు చెందిన మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ ట్రస్టుల చైర్మన్‌గా ఉన్న టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజును రాత్రికిరాత్రి మారుస్తూ.. సీఎం జగన్ జీవో 72ను తీసుకువచ్చారు. ఈ క్రమంలో అశోక్ గజపతిరాజు సోదరుడు దివంగత ఆనందగజపతి రాజు కుమార్తె సంచయిత ను నియమించారు.
అప్పట్లో తీవ్ర వివాదాలకు దారితీసిన ఈ వ్యవహారం.. రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. జగన్ ఇచ్చిన జీవోను అడ్డు పెట్టుకుని రాత్రికిరాత్రి ఢిల్లీ నుంచి వచ్చిన సంచయిత సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఈ వివాదంపై అశోక్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు.. కొన్నాళ్ల కిందటే.. అశోక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా తుది తీర్పు వెలువరించింది.
మాన్సాస్, సింహాచల ట్రస్టుల ఛైర్మన్ నియామక జీవో 72ను కొట్టేసిన హైకోర్టు.. సంచయిత గజపతిరాజు నియామకం చెల్లదని తేల్చిచెప్పింది. అశోక్ గజపతిరాజును ట్రస్టుల ఛైర్మన్‌గా పునర్నియమించాలని జగన్ సర్కారును ఆదేశించింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టులో సవాల్ చేసిన అశోక్ గజపతిరాజు సహా ప్రభుత్వం సహా సంచయిత తరఫున వాదనలు విన్న హైకోర్టు.. అశోక్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అంతేకాదు.. మహాలక్ష్మి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్‌గా కూడా అశోక్‌ను నియమించాలని ఆదేశించింది.