ఇప్పటి రాజకీయాలంతా అవసరాలు, అవకాశాలుగా మారిపోయింది. అవసరమున్నపుడు దగ్గరకు తీసుకోవటం, అవసరం తీరిపోగానే దూరంగా నెట్టేయటం అందరు చూస్తున్నదే. అదే సందర్భంగా ఎదుటివాళ్ళ అవసరాలనే తమకు అవకాశంగా మలచుకుని తమ డిమాండ్లను సాధించుకుంటున్న విషయాలు కూడా చూస్తున్నదే. ఇప్పుడిదంతా ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ పరిస్ధితికి సరిగ్గా సరిపోతుందని చెప్పేందుకే.
వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుత యోగి ప్రభుత్వంపై జనాల్లో మంట పెరిగిపోతోంది. ఈమధ్యనే జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ తలబొప్పికట్టిన విషయం అందరికీ తెలిసిందే. చివరకు నరేంద్రమోడి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలోని స్ధానిక సంస్ధల్లో కూడా బీజేపీ ఓడిపోయింది. ఇదే ట్రెండ్ కంటిన్యు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తప్పదని మోడికి అర్ధమైపోయింది.
అందుకనే ఎన్డీయేలోని చిన్నపార్టీలను బుజ్జగించే పనిలో పడ్డారు. మోడి తరపున బాధ్యతను తీసుకున్న అమిత్ షా తో యూపిలోని చిన్నపార్టీలు అప్నాదళ్, నిషాద్ అధినేతలు భేటీ అయ్యారు. పేరుకు ఇవి చిన్నపార్టీలే అయినా యూపిలోని కొన్ని ప్రాంతాల్లో గట్టి ప్రభావం చూపగలవు. అప్నాదళ్ ఏమో యూపిలోని బలమైన సామాజికవర్గానికి చెందిన కుర్మిలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
అలాగే నిషాద్ ఏమో మత్స్యకార వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రెండోసారి మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీలను ఢిల్లీలో, యూపిలో ఏమాత్రం పట్టించుకోలేదు. యూపిలో తమ పరిస్దితి బావోలేదని తేలిపోవటంతో ఇపుడు అవే పార్టీలు అక్కరకొచ్చాయి. అందుకనే పిలిచి బుజ్జగిస్తున్నారు. ఇంకేముంది అప్నాదళ్ పార్టీ తరపున తనకు కేంద్రమంత్రిపదవి+రాష్ట్రంలో తన భర్తకు మంత్రిపదవి కావాలని ఎంపి అనుప్రియా పటేల్ గట్టిగా పట్టుబట్టారట. చేసేది లేక అమిత్ అందుకు అంగీకరించారట.
ఇదే విధంగా నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ కూడా తనకు కేంద్రమంత్రి పదవికి చేసిన డిమాండ్ ను అమిత్ అంగీకరించారట. అలాగే మత్స్యకారులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. గడచిన రెండేళ్ళుగా వాళ్ళని పట్టించుకోని పాపానికి ఇపుడు అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళ డిమాండ్లను అంగీకరించాల్సొస్తోంది. మొత్తానికి రాజకీయాలు సమస్తం అవసరాలు-అవకాశాలు చుట్టే తిరుగుతోందనేందుకు ఇదే తాజా రుజువు.
Gulte Telugu Telugu Political and Movie News Updates