దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎదురుగాలిని ఎదుర్కోవడం, ప్రతిపక్ష పార్టీగా పుంజుకోవాల్సింది పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ ఎదురుకానుందని ప్రచారం జరుగుతోంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బెంగాల్ లో అధికార పార్టీ అయిన టీఎంసీలో చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరికల విషయంలో సీరియస్ గా ఉన్న మమతా బెనర్జీ ఈ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారని అంటున్నారు.
రాహుల్ గాంధీ సన్నిహితుడనే పేరున్న మాజీ కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద ఇటీవల ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో రాహుల్ టీంలోని యువనేతలపై వివిధ వర్గాల చూపు పడింది. గతంలో ఎంపీగా పనిచేసి ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కమిటీ చీఫ్ గానూ వ్యవహరించి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ అడుగులపై చర్చ జరిగింది. ముఖర్జీ స్నేహితుడు జితిన్ ప్రసాద వలే ఆయన సైతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను ముఖర్జీ తోసిపుచ్చారు.
తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, టీఎంసీ లేదా ఇతర పార్టీలో చేరతాననే ప్రచారం అవాస్తవమని అభిజిత్ ముఖర్జీ తేల్చిచెప్పారు. ప్రస్తుతం టీఎంసీలో ఉన్న తన తండ్రి సహచరులే ఇలాంటి వదంతులకు కారణమని ముఖర్జీ పేర్కొన్నారు. తాను టీఎంసీ భవన్ కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నానని అభిజిత్ అన్నారు. అభిజిత్ జంగిపూర్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపొందారు. కోల్కతా నుంచి జంగీపూర్ దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఎంసీలో చేరతానని వస్తున్న వార్తలకు అభిజిత్ ఇలా వ్యంగ్యంగా కొట్టిపారేశారు.