మహారాష్ట్రలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశ అత్యున్నత పదవిపై కన్నేశారా ? అవునే అంటున్నాయి సన్నిహిత వర్గాలు. 2022లో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికపై పవార్ కన్నేసినట్లు తాజా సమాచారం. ఇందులో భాగంగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో పవార్ భేటీ అయ్యారట. రాష్ట్రపతి ఎన్నికకు వ్యూహకర్త ప్రశాంత్ కు ఏమిటి సంబంధం ? అనే డౌట్ రావచ్చు.
తొందరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్ధితిపై చర్చించేందుకే ప్రశాంత్ తో పవార్ భేటీ అయ్యారట. నిజానికి పవార్ కన్ను ప్రధానమంత్రి స్ధానంపైనే ఉండేది. కానీ అది తనకు అందే అవకాశం లేదని నిర్ధారణ అయిన తర్వాత రాష్ట్రపతి పదవిపై దృష్టిపెట్టారు. ఒకవైపు బీజేపీ బలహీనపడుతోంది. కాబట్టి ఎన్డీయే బలం కూడా తగ్గిపోతుందని పవార్ అంచనాలో ఉన్నారని సమాచారం.
ఎన్డీయే యేతర, యూపీఏ పార్టీల బలం గనుక పుంజుకుంటే తనకు రాష్ట్రపతి అవటానికి అవకాశాలు పెరుగుతాయని పవార్ భావిస్తున్నారు. మామూలుగా అయితే అధికారంలో ఉన్న కూటమి ఎవరిని ఎంపికచేస్తే వాళ్ళే రాష్ట్రపతి అవుతారు. అయితే ఒక్కోసారి పోటీ అనివార్యమవుతుంది. పోటీ పెట్టడం ద్వారా రాష్ట్రపతి పదవిని అందుకోవచ్చనే పరిస్దితులు కనబడితే అప్పుడు తాను పోటీ చేసి గెలవాలన్నది పవార్ ఆలోచన.
రాష్ట్రపతి పదవికి పోటీ అనివార్యమైతే తనకు మద్దతుగా ఏపి, తెలంగాణా, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఒడిస్సా లాంటి రాష్ట్రాలు నిలుస్తాయని పవార్ అంచనా వేసుకుంటున్నారట. రాష్ట్రపతి పదవికి పోటీ జరిగితే అప్పుడు ఎంపిలతో పాటు ఎంఎల్ఏలు కూడా ఓట్లేయాల్సుంటుంది. 2022లో జరిగే పోటీ సమయానికి బీజేపీ బలహీనపడుతుందని అంచనాలున్నాయి.
వచ్చే ఏడాది జరగబోయే ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి పెద్ద రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ పరిస్ధితి ఏమిటో తెలుసుకునేందుకే ప్రశాంత్ కిషోర్ తో పవార్ భేటీ అయినట్లు సమాచారం. మొత్తంమీద ఇటు కాంగ్రెస్, అటు ఏన్డీయేయేతర పార్టీల మద్దతు కోసం పవార్ గట్టిగానే పావులు కదుపుతున్న విషయం అర్ధమైపోతోంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates